ఉప్పు నీటిని గొంతులో పోసుకుని రోజూ పుక్కిలించాలి ? ఎందుకంటే..?

గొంతు సమస్యలు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడేవారు ఆ సమస్యల నుంచి బయట పడేందుకు సహజంగానే గొంతులో ఉప్పు నీటిని పోసుకుని పుక్కిలిస్తుంటారు. ఈ చిట్కా ఆ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎంతో కాలం నుంచి దీన్ని పాటిస్తున్నారు. దీని వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. అయితే కేవలం సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా రోజూ ఉప్పు నీటితో పుక్కిలించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని వారు సూచిస్తున్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!

health benefits of salt water gargling everyday health benefits of salt water gargling everyday

1. రోజూ ఉప్పు నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతులో యాసిడ్లు తటస్థం అవుతాయి. దీంతోపాటు బాక్టీరియా నశిస్తుంది. ఫలింగా పీహెచ్‌ స్థాయిలు సమతుల్యం అవుతాయి. ఈ క్రమంలో నోట్లో ఉన్న బాక్టీరియా కూడా నశిస్తుంది. దీని వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.

2. ఉప్పు నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల శ్వాసకోశ వ్యవస్థలో మ్యూకస్‌ పేరుకుపోకుండా ఉంటుంది. నాసికా రంధ్రాల్లోనూ మ్యూకస్‌ చేరదు. దీంతో వాపులు తగ్గుతాయి. గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. బాక్టీరియా, వైరస్‌లు నాశనం అవుతాయి. ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

3. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు రోజుకు మూడు సార్లు ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. సాధారణ వ్యక్తులు కూడా ఇలా చేయడం వల్ల శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

4. బాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్ల కారణంగా గొంతులో ఉండే టాన్సిల్స్‌ వాపులకు గురవుతాయి. దీంతో అవి నొప్పిని కలిగిస్తాయి. ఆహారం తినడం, ద్రవాలు తాగడం ఇబ్బంది అవుతుంది. అయితే ఉప్పు నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. వాపు, నొప్పి తగ్గుతాయి.

5. నోటి దుర్వాసనతో సతమతం అయ్యేవారు రోజూ గొంతులో ఉప్పు నీటిని పోసుకుని పుక్కిలిస్తుంటే ఫలితం ఉంటుంది.

6. చిగుళ్ల వాపులతోపాటు చిగుళ్ల నుంచి రక్తస్రావం అయ్యేవారు ఉప్పు నీటిని పుక్కిలించడం వల్ల ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో దంతాల నొప్పి కూడా తగ్గుతుంది.

7. నోట్లో పుండ్లు, పొక్కులు ఏర్పడే వారు ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల ఫలితం ఉంటుంది. నోరు శుభ్రంగా మారుతుంది.

ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్‌ ఉప్పును వేసి అది కరిగే వరకు బాగా కలపాలి. ఒక పెద్ద గుక్కలో ఆ మిశ్రమాన్ని తీసుకుని గొంతులోకి వచ్చేలా చేయాలి. ఆ తరువాత తలను వెనక్కి వంచి గొంతులో నీరు ఉండగానే పుక్కిలించాలి. ఇలా 30 సెకండ్ల పాటు చేయాలి. అనంతరం ఆ నీటిని ఉమ్మేయాలి. ఈ విధంగా రోజూ ఉదయాన్నే రెండు మూడు సార్లు చేస్తే పైన తెలిపిన సమస్యల నుంచి బయట పడవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts