Cucumber : కీరదోసను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కీరదోసలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. అలాగే ఈ ఫైబర్ బరువు తగ్గడంలో సహాయ పడుతుంది. కొవ్వును కరిగిస్తుంది. షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతుంది. కీరదోసలో ఉండే పొటాషియం, మెగ్నిషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో హైబీపీ తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కీరదోసలో ఉండే విటమిన్ కె గాయాలు అయినప్పుడు రక్తం గడ్డ కట్టేలా చేయడంలో సహాయ పడుతుంది. అలాగే మనం తినే ఆహారాల్లో ఉండే కాల్షియంను శరీరం శోషించుకునేందుకు విటమిన్ కె సహాయ పడుతుంది. ఇలా కీరదోసతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
కీరదోసను సహజంగానే చాలా మంది వేసవి కాలంలో తింటారు. ఎందుకంటే ఇది శరీరానికి చలువ చేస్తుంది. కనుక వేసవిలో కీరదోసను తింటే ఎండ వేడి నుంచి తప్పించుకోవచ్చు. శరీరం చల్లగా ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అయితే వాస్తవానికి కీరదోసను కేవలం వేసవిలోనే కాదు.. ఏ సీజన్‌లో అయినా సరే తినవచ్చు. దీంతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇక చాలా మంది కీరదోసను భోజనంతోపాటు తింటుంటారు. అన్నం తింటూ మధ్య మధ్యలో కీరదోస ముక్కలను తింటారు. కానీ ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్రకారం ఇలా భోజనంతో కీరదోసను తినడం మంచిది కాదట. ఇది మనకు కీడు చేస్తుందని అంటున్నారు.
కీరదోస చలువ చేసే పదార్థం. పైగా వీటిని ఉడికించరు. నేరుగా అలాగే పచ్చిగానే తింటారు. ఇక భోజనం అంటే ఉడకబెట్టిన ఆహారం. ఈ క్రమంలోనే ఉడికించిన, ఉడకబెట్టని ఆహారాలను కలిపి ఒకేసారి తింటే శరీరంలో ఆమం పెరుగుతుంది. దీంతో వాత, పిత్త, కఫ దోషాల్లో అసమతుల్యతలు వస్తాయి. ఇది అనారోగ్యాలను కలగజేస్తుంది. కనుక ఉడకించిన, ఉడకబెట్టని ఆహారాలను ఒకేసారి తినరాదు. కనీసం 1 గంట వ్యవధి ఉండాలని చెబుతున్నారు. ఇదే కోవలో భోజనంతోపాటు కీరదోసను కూడా తినరాదని.. భోజనానికి 1 గంట ముందు లేదా 1 గంట తరువాత మాత్రమే కీరదోసను తీసుకోవాలని.. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
పచ్చి ఆహారాలను, ఉడకించిన ఆహారాలను ఒకేసారి కలిపి తింటే అది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీంతో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. దీని వల్ల గ్యాస్ ఏర్పడుతుంది. అలాగే మలబద్దకం వస్తుంది. కనుక వండిన ఆహారాలతో ఎప్పుడూ కూడా పచ్చి ఆహారాలను కలిపి తినరాదు. తింటే అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి ఇకపై భోజనంతో కీరదోసను తినకండి. కనీసం 1 గంట సమయం వేచి చూశాకే తినండి. లేదంటే కోరి సమస్యలను తెచ్చుకున్నట్లు అవుతుంది.