Prawns Masala Curry : మనం ఆహారంగా తీసుకునే సముద్రపు ఆహారంలో రొయ్యలు కూడా ఒకటి. రొయ్యలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాల్లో రొయ్యలు ఒకటి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ రొయ్యలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. రొయ్యలతో చేసే కూరలు తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. అందులో భాగంగా రొయ్యలతో ఎంతో రుచిగా మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పడు తెలుసుకుందాం.
రొయ్యల మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
రొయ్యలు – 250 గ్రా., తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, అల్లం – 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 8, నూనె – అర కప్పు, కరివేపాకు – రెండు రెమ్మలు, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – పావు లీటర్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – అర కట్ట.
రొయ్యల మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా రొయ్యలను శుభ్రంగా కడగాలి. తరువాత అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తరువాత వీటిని ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో అర కప్పు నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను వేసి 50 శాతం వేగే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మరో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి.
ఇవి వేగిన తరువాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత నీళ్లు, వేయించిన రొయ్యలు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలి కూర దగ్గర పడే వరకు ఉడికించాలి. కూర దగ్గర పడిన తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్యల మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రొయ్యలతో ఈ విధంగా కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు రొయ్యల్లో ఉండే పోషకాలను, రొయ్యలను ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు.