Meal Maker : మీల్ మేకర్.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. వీటిని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అయితే చాలా మంది వీటిని తినాలా వద్దా అని సందేహిస్తూ ఉంటారు. అసలు చాలా మందికి వీటిని కూడా ఆహారంగా తీసుకోవచ్చు అన్న సంగతి కూడా తెలియదు. అలాగే చాలా మంది ఇవి మాంసంతో తయారు చేస్తారు అని భావిస్తూ ఉంటారు. అసలు ఈ మీల్ మేకర్ ను ఎలా తయారు చేస్తారు. వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. వీటిని ఎవరు తినాలి.. ఎవరు తినకూడదు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీల్ మేకర్ ఫ్యూర్ వెజిటేరియన్ ఫుడ్ అని చెప్పవచ్చు. వీటిని సోయా గింజల నుండి తయారు చేస్తారు.
సోయా గింజల నుండి నూనె తీసిన తరువాత మిగిలిన పిప్పి నుండి వీటిని తయారు చేస్తారు. మీల్ మేకర్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వీటితో ఎక్కువగా మసాలా కూరలతో పాటు వెజిటబుల్ దమ్ బిర్యానీ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. ఈ మీల్ మేకర్ లను తినడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. 100 గ్రాముల మీల్ మేకర్ లో 52 గ్రాముల ప్రోటీన్, 13 గ్రాముల ఫైబర్, 35 గ్రాముల్లో ఇతర విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. శాఖాహారులు వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినన్ని ప్రోటీన్స్ లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కండరాలు ధృడంగా తయారవుతాయి.
శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. ఎముకలు ధృడంగా మారతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడవచ్చు. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె పనితీరు మెరుగుపడుతుందని పరిశోధనల్లో తేలింది. మీల్ మేకర్ లను తినడం వల్ల లాభాలు ఉన్నప్పటికి వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. పురుషులు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వారిలో రొమ్ములు పరిమాణం పెరిగే అవకాశం ఉంది. అలాగే స్త్రీలు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి శరీరంలో నీరు రావడం, వాపులు, గ్యాస్, ముఖం పై మొటిమలు, మచ్చలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
అలాగే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల మూత్రపిండాలు దెబ్బతినే అవకావం ఉంది. అలాగే కీళ్ల నొప్పులు, వాపులు వచ్చే అవకాశం ఉంది. ఈ మీల్ మేకర్ లను రోజుకు 25 నుండి 30 గ్రాముల మోతాదులో మాత్రమే తీసుకోవాలి. వీటిని వీలైనంత వరకు ఇంట్లోనే తాజాగా వండుకుని తినాలి. ఈ విధంగా మిల్ మేకర్ లను తగిన జాగ్రత్తలు పాటిస్తూ తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.