Indian Broad Beans For Liver : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో చిక్కుడు కాయలు ఒకటి. ఇవి సంవత్సరమంతా మనకు లభించినప్పటికి చలికాలంలో మరీ ఎక్కువగా లభిస్తాయి. చిక్కుడు కాయలను, చిక్కుడు గింజలను మనం కూరగా వండుకుని తింటూ ఉంటాం. చిక్కుడు కాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన కాలేయానికి ఇవి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. కాలేయం డిటాక్సిఫికేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తూ మన శరీరాన్ని కాపాడుతుంది. కాలేయం ఈ డిటాక్సిఫికేషన్ ప్రక్రియను రెండు దశల్లో కూడా చక్కగా నిర్వహించేలా చేయడంలో చిక్కుడు గింజలు, చిక్కుడు కాయలు సమర్థవంతంగా పని చేస్తాయి.
ఈ గింజల్లో కెరోటినాయిడ్స్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటి కారణంగా కాలేయంలో ఎస్ ఒ డి, గ్లుటాథియోన్ అనే ఎంజైమ్ లు ఎక్కువగా విడుదల అవుతాయి. ఈ ఎంజైమ్ లు కాలేయంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ చక్కగా జరిగేలా చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి ఈ రెండు రకాల ఎంజైమ్ లు కాలేయనికి ఎంతో అవసరం. ఈ రెండు రకాల ఎంజైమ్ లు కాలేయానికి ఎక్కువగా అందడం వల్ల శరీరంలోని ఫ్రీరాడికల్స్, వ్యర్థాలను, విష పదార్థాలను కాలేయం సమర్థవంతంగా బయటకు పంపిస్తుంది. చిక్కుడు కాయలను, చిక్కుడు గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల కాలేయం ఈ విష పదార్థాలను మొదటి దశలో చక్కగా నిర్వీర్యం చేస్తుంది. తరువాత రెండో దశలో విచ్ఛిన్నం చేస్తుంది. ఇలా విచ్చినం చేసిన వ్యర్థాలను మూడో దశలో 80 శాతం యూరిన్ ద్వారా, 20 శాతం మలం ద్వారా బయటకు పంపిస్తుంది.
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో కాలేయానికి ఈ విధంగా చిక్కుడు గింజలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే చిక్కుడు కాయల్లో 9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరకుండా చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థ సక్రమంగా సాగేలా చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు, ఊబకాయంతో బాధపడే వారు కూడా ఈ చిక్కుడు కాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. చిక్కుడు గింజలను, చిక్కుడు కాయలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని కనుక ఇవి లభించినప్పుడు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.