Ragi Java : చిరు ధాన్యాలైన రాగులను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగులను తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మనందరికి తెలుసు. రాగి పిండితో వివిధ రకాల వంటకాలను తయారు చేయడంతో పాటు జావను కూడా తయారు చేసి ఆహారంగా తీసుకుంటున్నాం. రాగి పిండిని ఉపయోగించి చేసే రాగి జావను చాలా మంది తాగే ఉంటారు. ప్రస్తుత కాలంలో రాగి జావను తీసుకునే వారి శాతం పెరుగుతుందనే చెప్పవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రాగి జావలో రుచి కొరకు ఉప్పు, మజ్జిగ, పంచదార వంటి వాటిని కలిపి కూడా తీసుకుంటారు. కొందరూ ఉదయం పూట ప్రతిరోజూ ఈ రాగి జావను తీసుకుంటూ ఉంటారు. అసలు రాగి జావను తీసుకోవచ్చా.. తీసుకోకూడదా.. రాగి జావను తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
100 గ్రాముల రాగుల్లో 344 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 328 క్యాలరీల శక్తి, 3.6 గ్రాముల పీచు పదార్థాలు, 7.3 గ్రాముల ప్రోటీన్లు, 1.3 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇతర చిరు ధాన్యాల్లో కంటే, పాలల్లో కంటే రాగుల్లోనే క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. నీరసం తగ్గించడానికి, ఎముకలను పుష్టిగా ఉంచడానికి, జబ్బు చేసి కోలుకుంటున్న వారికి బలాన్ని అందించడానికి ఈ రాగి జావ ఉపయోగపడుతుంది. ఈ జావ చాలా సులభంగా కూడా జీర్ణమవుతుంది. పూర్వం రోజుల్లో క్యాల్షియాన్ని, అందించి నీరసాన్ని తగ్గించే ఇతర ఆహారాలు ఎక్కువగా ఉండేవి కావు. కనుక ఆ రోజుల్లో రాగి జావను ఎక్కువగా తీసుకునే వారు. కానీ ప్రస్తుత కాలంలో క్యాల్షియాన్ని అందించే ఇతర ఆహారాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. రాగుల్లో కంటే ఆకుకూరల్లో, నువ్వుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. పూర్వం రోజుల్లో ఎక్కువగా ధ్యానాలనే ఆహారంగా తీసుకునే వారు.
ఈ ధాన్యాలనే జావగా, గటకగా, రొట్టెగా చేసుకుని తినే వారు. శారీరక శ్రమ చేసే వారు ఎక్కువగా ధాన్యాలను తీసుకోవాలి. శ్రమ చేసే వారికి తగినంత శక్తిని అందించడంలో ఈ ధాన్యాలు ఉపయోగపడతాయి. కానీ ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ చేసే వారు తక్కువగా ఉన్నారు. శారీరక శ్రమ తక్కువగా చేసే వారికి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అవసరం ఉండదు. మనకు వచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం కార్బోహైడ్రేట్స్ ను ఎక్కువగా తీసుకోవడం. మూడు పూటలా ధాన్యాలనే ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాము. మనం అన్నం, చపాతీ, పుల్కా రూపంలో ధాన్యాలనే తీసుకుంటున్నాము. రాగులు కూడా ధాన్యాలే. ఈ రాగులతో చేసిన జావను తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి కార్బోహైడ్రేట్స్ అందుతాయి. కనుక తక్కువగా శారీరక శ్రమ చేసేవారు ఈ రాగి జావను తీసుకోవడం తగ్గించాలి.
ఎప్పుడైనా జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు తేలికగా జీర్ణమయ్యే ఈ రాగి జావను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉదయం పూట సమయం లేనప్పుడు రాగి జావను తయారు చేసుకుని తాగవచ్చు. ఎప్పుడైనా వేడి వేడిగా తాగాలనిపించినప్పుడు ఈ రాగి జావను తీసుకోవచ్చు. ఉదయం పూట రాగి జావకు బదులుగా మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల రాగి జావ కంటే ఎక్కువ క్యాల్షియాన్ని, శక్తిని, పోషకాలను పొందవచ్చు. ప్రస్తుత కాలంలో మనకు పోషకాలను అందించే ఆహారాలు మనకు విరివిరిగా లభిస్తున్నాయి. రాగిజావకు బదులుగా పోషకాలను కలిగిన ఇతర ఆహారాలను తీసుకోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.