Ariselu : అరిసెల‌ను ఇలా చేస్తే మెత్త‌గా రుచిగా ఉంటాయి.. తినేకొద్దీ తినాల‌నిపిస్తుంది..

Ariselu : అరిసెలు.. వీటి గురించి మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. వీటిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. సంక్రాంతి పండుగ‌కు వీటిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. బెల్లంతో వీటిని త‌యారు చేస్తాము క‌నుక వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. అరిసెల‌ను రుచిగా, చ‌క్క‌గా మెత్త‌గా ఉండేలా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తిన్నాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ అరిసెల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అరిసెల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దొడ్డు బియ్యం – ఒక‌టిన్న‌ర గ్లాస్, బెల్లం తురుము – ఒక గ్లాస్, నీళ్లు – పావు గ్లాస్,పంచ‌దార – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, నువ్వులు – 4 టేబుల్ స్పూన్స్.

Ariselu recipe in telugu make in this method
Ariselu

అరిసెల త‌యారీ విధానం..

ముందుగా బియ్యాన్ని రెండు నుండి మూడు సార్లు క‌డిగి త‌గినన్ని నీళ్లు పోసి రెండు రోజుల పాటు నాబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని మూడ పూట‌లా క‌డుగుతూ వేరే నీటిని పోస్తూ ఉండాలి. ఇలా నానబెట్టిన త‌రువాత బియ్యాన్ని ఒక జ‌ల్లిగిన్నెలోకి తీసుకుని నీరు అంతా పోయేలా చేసుకోవాలి. త‌రువాత ఈ బియాన్ని జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ పిండిని జ‌ల్లించి త‌డి ఆరిపోకుండా దానిపై ప్లేట్ ను పెట్టుకోవాలి. ఎక్కువ మొత్తంలో త‌యారు చేసే వారు మ‌ర ఆడించిన పిండిని కూడా జ‌ల్లించుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు, పంచ‌దార వేసి వేడి చేయాలి. బెల్లం క‌రిగిన త‌రువాత ఈ బెల్లం నీటిని వ‌డ‌క‌ట్టి మ‌ర‌లా గిన్నెలోకి తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల బెల్లంలోని మ‌లినాలు తొల‌గిపోతాయి. ఇప్పుడు ఈ బెల్లం నీటిని లేత తీగ పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. బెల్లం మిశ్ర‌మాన్ని నీటిలో వేసి చూస్తే మెత్త‌ని ఉండ‌లా అవ్వాలి. ఇలా పాకం రాగానే స్ట‌వ్ ఆఫ్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత వెంట‌నే ముందుగా త‌యారు చేసుకున్న బియ్యం పిండిని వేస్తూ క‌లుపుతూ ఉండాలి. పండి మ‌రీ గ‌ట్టిగా కాకుండా జారుడుగా ఉండేలా చూసుకోవాలి. పాకం ముదిరిన, పిండి గ‌ట్టిగా అయినా అరిసెలు గ‌ట్టిగా అవుతాయి. ఇలా త‌యారు చేసుకున్న పిండిని ఉండ‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడ‌య్యాక పాలిథిన్ క‌వ‌ర్ కు నూనె రాసుకుంటూ ఒక్కో పిండి ఉండ‌ను తీసుకుని అరిసెల ఆకారంలో వ‌త్తుకోవాలి. వీటిని నెమ్మ‌దిగా సున్నితంగా మ‌రీ ప‌లుచ‌గా కాకుండా వ‌త్తుకోవాలి. త‌రువాత ఈ అరిసెను నూనెలో వేడి మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి.

త‌రువాత అరిసె బ‌య‌ట‌కు తీసి నూనె పోయేలా అరిసెల గిద్ద‌ల్లో వేసి వ‌త్తుకోవాలి. ఈ గిద్దెలు అందుబాటులో లేని వారు రెండు గంటెల మ‌ధ్య అరిసెను ఉంచి నూనె పోయేలా వ‌త్తుకోని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మ‌నం నువ్వుల అరిసెను కూడా చేసుకోవ‌చ్చు. పిండి ఉండ‌కు నువ్వుల‌ను అద్ది అరిసెల వ‌త్తుకుని కాల్చుకోవాలి. వీటిని కూడా అరిసెల‌ను వ‌త్తుకున్న‌ట్టే వ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, మెత్త‌గా ఉండే అరిసెలు త‌యార‌వుతాయి. వీటిని గాలి, త‌డి త‌గ‌ల‌కుండ నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల చాలా రోజుల వ‌ర‌కు తాజాగా ఉంటాయి. అలాగే వీటిని కాల్చుకునేట‌ప్పుడు నూనె వేడిగా ఉండేలా చూసుకోవాలి. కేవ‌లం పండుగ‌ల‌కే కాకుండా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్పుడ‌ప్పుడూ ఇలా అరిసెల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు శ‌రీరం కూడా బ‌లంగా త‌యార‌వుతుంది.

Share
D

Recent Posts