Daily 4 Anjeer : పూర్వం మన పెద్దలకు కేవలం వయస్సు మీద పడిన తరువాత ఎప్పటికో షుగర్ వచ్చేది. కానీ ఇప్పుడు చిన్నారులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. ఇది అస్తవ్యస్తమైన జీవన విధానం కారణంగానే వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. క్లోమ గ్రంథి ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసినా శరీరం ఆ ఇన్సులిన్‌ను ఉపయోగించుకోలేదు. దీంతో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతుంటాయి. దీంతో డయాబెటిస్ వస్తుంది.
అయితే డయాబెటిస్ వచ్చిన వారు డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి. అలాగే లైఫ్ స్టైల్‌లోనే పలు మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. రాత్రి త్వరగా పడుకుని ఉదయం త్వరగా నిద్ర లేవాలి. అలాగే రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. రోజూ అన్ని పోషకాలు ఉన్న ఆహారాలను వేళకు తినాలి. ఇలా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు డైట్ ప్లాన్‌ను పాటించాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారికి అంజీర్ పండ్లు వరమనే చెప్పవచ్చు. ఇవి మనకు రెండు రకాలుగా మార్కెట్ లో లభిస్తాయి.
అంజీర్ పండ్లను చాలా మంది డ్రై ఫ్రూట్స్ రూపంలో చూసి ఉంటారు. అలాగే ఇవి నేరుగా పండ్లుగా కూడా లభిస్తుంటాయి. అయితే ఎలా తిన్నప్పటికీ అంజీర్ పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. అంజీర్ పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయ పడుతుంది. అంజీర్ పండ్లు నాలుగైదు తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ పండ్లను తిని అనంతరం ఆ నీళ్లను తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే తప్పక ఫలితం ఉంటుంది. షుగర్ లెవల్స్ దిగి వస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
ఇక అంజీర్ పండ్లను తినడం వల్ల మనకు పలు ఇతర లాభాలు కూడా కలుగుతాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుతుంది. దీంతో గ్యాస్, కడుపులో మంట, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంజీర్ పండ్లను తినడం వల్ల కొవ్వును కరిగించుకోవచ్చు. దీంతో అధిక బరువు తగ్గుతారు. రక్తం తక్కువగా ఉన్నవారికి కూడా ఈ పండ్లను వరంగానే చెప్పవచ్చు. రోజూ వీటిని తింటుంటే రక్తం తయారవుతుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. ఇలా అంజీర్ పండ్లతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి వాటిని రోజూ నీటిలో నానబెట్టి తినండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.