ఆర్థరైటిస్ సమస్య అనేది సహజంగా వయస్సు మీద పడిన వారికి వస్తుంది. కానీ ప్రస్తుత తరుణంలో బిజీ టెక్ యుగం నడుస్తున్న కారణంగా చిన్న వయస్సులో ఉన్నవారు సైతం ఆర్థరైటిస్ బారిన పడుతున్నారు. యుక్త వయస్సులోనే ఆర్థరైటిస్ వచ్చి సతమతం అవుతున్నారు. ఆర్థరైటిస్ వస్తే కీళ్ల నొప్పులు, వాపులు వర్ణనాతీతంగా ఉంటాయి. అయితే సాధారణంగా చాలా మంది పాటించే అలవాట్ల వల్లే ఆర్థరైటిస్ నొప్పులు అనేవి వస్తుంటాయి. దీన్ని గమనించక ఆ అలవాట్లను అలాగే కంటిన్యూ చేస్తారు. దీంతో ఆర్థరైటిస్ కూడా తీవ్రతరం అవుతుంది. అయితే ఆయా అలవాట్లను మానేస్తే ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు వీలు కలుగుతుంది. ఇక ఆర్థరైటిస్‌కు కారణం అయ్యే ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది రోజూ పోషకాహారం తినడం లేదని పలు గణాంకాలు చెబుతున్నారు. రోజూ ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు కూడా చాలా మంది జంక్ ఫుడ్, నూనె పదార్థాలను ఎక్కువగా తింటున్నారు. దీంతో శరీరానికి అవసరం అయ్యే పోషకాలు సరిగ్గా లభించడం లేదు. ఇది ఆర్థరైటిస్‌కు కారణం అవుతోంది. అయితే జంక్ ఫుడ్‌కు స్వస్తి చెప్పి రోజూ పండ్లు, నట్స్ వంటి వాటిని తింటే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
ఇక ఆర్థరైటిస్ నొప్పులు వచ్చేందుకు మరో కారణం శారీరక శ్రమ లేకపోవడమే అని చెప్పవచ్చు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా తేలికపాటి వ్యాయామం లేదా వాకింగ్ చేస్తే చాలు, దీంతో ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. లేదంటే సమస్య తీవ్రతరం అవుతుంది. ఇక బరువును నియంత్రణలో ఉంచుకోకపోవడం కూడా ఆర్థరైటిస్ నొప్పులకు కారణమవుతోంది. అలాగే రోజంతా కూర్చుని పనిచేసేవారు సరైన భంగిమలో కూర్చుని పనిచేయకపోతే దాంతో కూడా ఆర్థరైటిస్ నొప్పులు వస్తాయట. కనుక ఇప్పుడు చెప్పిన అలవాట్లు గనక మీకు ఉంటే వెంటనే మార్చుకోండి. లేదంటే ఆర్థరైటిస్ బారిన పడి జీవితాంతం నొప్పులు, వాపులను అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే.