Mango Lasssi : వేసవి కాలంలో సహజంగానే ఎవరైనా సరే శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు యత్నిస్తుంటారు. అందులో భాగంగానే వారు రకరకాల పానీయాలను తాగుతుంటారు. అయితే ఈ సీజన్‌లో లభించే మామిడి పండ్లతో చక్కని లస్సీ తయారు చేసుకుని ఎంచక్కా రోజూ తాగవచ్చు. దీంతో శరీరంలోని వేడి మొత్తం పోవడమే కాకుండా.. వేసవి తాపం తగ్గుతుంది. అలాగే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఎండదెబ్బ తగలకుండా ఉంటుంది. దీంతోపాటు మామిడి పండ్లలో ఉండే పోషకాలు కూడా మనకు లభిస్తాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. చల్లని పానీయాన్ని తాగినట్లు ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇక మామిడి కాయ లస్సీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి పండు లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – అర లీటర్, మామిడి పండు గుజ్జు – పావు కిలో, చక్కెర – నాలుగు టేబుల్ స్పూన్లు.
మామిడి పండు లస్సీ తయారీ విధానం..
పెరుగుకు సమానంగా నీళ్లు తీసుకోవాలి. పెరుగులో నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. దీంట్లో చక్కెర వేసి బాగా కలపాలి. మిక్సీ పట్టినప్పుడే చక్కెర వేస్తే బాగా కలసిపోతుంది. దీంట్లోనే మామిడి పండు గుజ్జును కూడా వేయాలి. ఈ గుజ్జును ఇంట్లోనే మామిడి పండ్ల నుంచి తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో కూడా లభిస్తుంది. ఇలా మామిడి పండ్ల గుజ్జు వేసి కలిపి లస్సీని తయారు చేయాలి. ఈ విధంగా లస్సీని తయారు చేసుకుని తరువాత దాన్ని రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత చల్లగా మారుతుంది. దాన్ని తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా శరీరంలోని వేడి పోతుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. పోషకాలు కూడా లభిస్తాయి.