Saggu Biyyam Java : వేసవి కాలంలో మనకు ఎంతో మేలు చేసే ఆహారాల్లో సగ్గు బియ్యం ఒకటి. దీంతో చాలా మంది పాయసం తయారు చేసుకుని తాగుతుంటారు. అయితే అలా కాకుండా దీంతో జావ తయారు చేసుకుని తాగాలి. ఇది ఎంతో ఆరోగ్యకరం. పైగా ఈ జావను తాగితే వేసవిలో శరీరం చల్లగా ఉంటుంది. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తగ్గుతుంది. దీంతోపాటు జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో చాలా మందికి వేడి కారణంగా విరేచనాలు అవుతుంటాయి. అయితే సగ్గు బియ్యంతో తయారు చేసే జావను తాగితే విరేచనాలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇక సగ్గు బియ్యం జావను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గు బియ్యం జావ తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గు బియ్యం – నాలుగు టేబుల్ స్పూన్లు, పాలు – అర కప్పు, చక్కెర – టేబుల్ స్పూన్, ఉప్పు – చిటికెడు.
సగ్గు బియ్యం జావను తయారు చేసే విధానం..
సగ్గు బియ్యాన్ని రెండు లేదా మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. నాలుగు కప్పుల నీళ్లు పోసి బాగా మెత్తబడేవరకు ఉడికించాలి. చల్లారిన తరువాత పాలు, చక్కెర, ఉప్పు వేసి బాగా కలపాలి. దీంతో సగ్గు బియ్యం జావ తయారవుతుంది. అయితే చక్కెర కాకుండా బెల్లం లేదా తేనెను కూడా వేసుకోవచ్చు. పాలకు బదులుగా పెరుగు లేదా మజ్జిగను కూడా ఉపయోగించవచ్చు. దీంతో కమ్మనైన సగ్గు బియ్యం జావ తయారవుతుంది. దీన్ని చల్లగా అయ్యాక తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా.