Atukula Payasam : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆహారాల్లో అటుకులు ఒకటి. వీటిని బియ్యాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. అయితే ఇవి బియ్యం కన్నా చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. పైగా పోషకాలు కూడా ఉంటాయి. అటుకులను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన కార్బో హైడ్రేట్స్ లభిస్తాయి. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ ఇవి సహాయపడతాయి. అటుకులలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. అయితే అటుకులతో అనేక రకాల ఆహారాలను తయారు చేయవచ్చు. వాటిల్లో అటుకుల పాయసం ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు, మనకు పోషకాలను, శక్తిని అందిస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – ఒక కప్పు, పాలు – రెండు కప్పులు, నీళ్లు – 2 కప్పులు, బెల్లం తురుము – ఒక కప్పు, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్స్, జీడి పప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్స్, బాదం పప్పు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
అటుకుల పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో అటుకులను వేసి 3 నిమిషాల పాటు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నెయ్యి వేసి నెయ్యి కాగాక జీడి పప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి వీటిని కూడా మరో గిన్నెలోకి తీసుకోవాలి. అదే కళాయిలో బెల్లంతోపాటు 4 టేబుల్ స్పూన్ల నీళ్లను వేసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం నీటిని వడబోసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే మలినాలు తొలగిపోతాయి.
తరువాత ఒక గిన్నెలో పాలు, నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఇప్పుడు మరుగుతున్న పాలలో ముందుగా వేయించుకున్న అటుకులను వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న బెల్లం నీటిని, యాలకుల పొడిని వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడి పప్పు, ఎండు కొబ్బరి ముక్కలతోపాటు మరో టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల పాయసం తయారవుతుంది. తరుచూ చేసుకునే పాయసానికి బదులుగా అప్పుడప్పుడూ అటుకులతో పాయసాన్ని చేసుకుని తినడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు మీ సొంతమవుతాయి.