Sweet Corn : మనకు మార్కెట్ లో మొక్కజొన్న కంకులతోపాటు స్వీట్ కార్న్ కూడా లభిస్తూ ఉంటుంది. దీనిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సాధారణ మొక్కజొన్న కంకి లాగా స్వీట్ కార్న్ కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. స్వీట్ కార్న్ లో శరీరానికి అవసరమయ్యే అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వీటిలో నియాసిన్, థయామిన్, రైబో ప్లేవిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి విటమిన్స్ తోపాటు సోడియం, పొటాషియం, కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నిషియం, జింక్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాల్లో స్వీట్ కార్న్ కూడా ఒకటి.
తరచూ స్వీట్ కార్న్ ను తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా స్వీట్ కార్న్ ఉపయోగపడుతుంది. కంటి చూపును మెరుగుపరుచడంలో, చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. బీపీని, షుగర్ ను నియంత్రించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో స్వీట్ కార్న్ సహాయపడుతుంది. స్వీట్ కార్న్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, రక్త హీనత సమస్యను తగ్గించడంలో కూడా స్వీట్ కార్న్ దోహదపడుతుంది. మనం ఉడికించిన స్టీట్ కార్న్ ను ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే వీటిని చాలా మంది నేరుగా నీటిలో వేసి ఉడికిస్తారు. ఇలా చేయడం వల్ల వీటిలో ఉండే పోషకాలు ఆవిరైపోతాయి. ఇలా నేరుగా నీటిలో వేసి ఉడికించిన వాటిని తిన్నా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. వీటిలో ఉండే పోషకాలు పోకుండా స్వీట్ కార్న్ ను ఎలా ఉడికించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్వీట్ కార్న్ కంకులను వలిచి గింజలను తీసుకోవాలి. ఒక గిన్నెలో లేదా కుక్కర్ లో రెండు గ్లాసుల నీటిని పోయాలి. ఇప్పుడు కుక్కర్ లో లేదా గిన్నెలో చిల్లుల గిన్నెను ఉంచి అందులో స్వీట్ కార్న్ గింజలను వేసి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ మధ్యస్థ మంటపై 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల స్వీట్ కార్న్ లో ఉండే పోషకాలు పోకుండా ఉంటాయి.
గింజలకు బదులుగా స్వీట్ కార్న్ కంకులను ఉంచి ఉంచి కూడా ఇలా ఉడికించవచ్చు. ఇలా ఉడికించిన స్వీట్ కార్న్ గింజలను నిల్వ చేసుకుని మనం వివిధ రకాల వంటల తయారీలో ఉపయోగించవచ్చు. లేదా నేరుగా తినవచ్చు. లేదా వీటితో మసాలా కార్న్, క్రిస్పీ కార్న్ వంటి స్నాక్స్ ను తయారు చేసుకుని తినవచ్చు. స్వీట్ కార్న్ ను ఈ విధంగా ఉడికించి తినడం వల్ల వీటిలో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయి. తద్వారా మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.