Masala Palli : మనం చాలా కాలం నుండి పల్లీలతో రకరకరాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉన్నాం. పల్లీలు మన శరీరానికి మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. మినరల్స్, విటమిన్స్ అధికంగా కలిగి ఉన్న వాటిల్లో పల్లీలు ఒకటి. పల్లీలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. గర్బం ధరించాలనుకునే మహిళలకు కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. పల్లీలతో మనం రకరకాల స్నాక్స్ ను కూడా తయారు చేసుకోవచ్చు. వీటితో తయారు చేసే స్నాక్స్ లలో మసాలా పల్లీలు ఒకటి. ఇవి మనకు బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. మనం ఇంట్లోనే చాలా సులువుగా బయట దొరికే వాటిలా ఉండే మసాలా పల్లీలను తయారు చేసుకోవచ్చు. మసాలా పల్లీలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా పల్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, పసుపు – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, నీళ్లు – కొద్దిగా.
మసాలా పల్లీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పసుపు, కారం, ఉప్పును వేసి కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ మరీ పలుచగా, మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి. తరువాత ఒక కళాయిలో పల్లీలను వేసి బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా పేస్ట్ లా చేసుకున్న మిశ్రమాన్ని వేసి పల్లీలకు అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పల్లీలను ఒక నిమిషం పాటు చిన్న మంటపై మళ్లీ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉంచాలి. తరువాత ఈ పల్లీలను ప్లేట్ లో వేసుకుని చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇలా చేయడం వల్ల క్రిస్పీగా, ఎంతో రుచిగా ఉండే మసాలా పల్లీలు తయారవుతాయి. పల్లీలు వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి. చల్లగా అయ్యే సరికి క్రిస్పీగా తయారవుతాయి. ఇలా తయారు చేసుకున్న మసాలా పల్లీలు 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. సాయంత్రం సమయాలలో శరీరానికి హానిని కలిగించే బయటి ఆహార పదార్థాలను తినడం కంటే ఇలా మసాలా పల్లీలను తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.