Pesara Pappu Charu : పెసర పప్పును మనం చాలా కాలం నుండి వంటింట్లో ఉపయోగిస్తూ ఉన్నాం. పెసర పప్పు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పెసర పప్పులో క్యాల్షియం, పొటాషియంతోపాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. బీపీని, షుగర్ ను నియంత్రించడంతో పాటు రక్తహీనతను తగ్గించడంలో పెసరపప్పు ఉపయోగపడుతుంది. పెసరపప్పును తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. మనం ఆహారంగా తీసుకునే అన్ని రకాల పప్పుల కంటే క్యాలరీలు తక్కువగా ఉండడమే కాకుండా త్వరగా జీర్ణమయ్యే పప్పు పెసరపప్పు. జుట్టు పెరుగుదలకు కూడా పెసర పప్పు సహాయపడుతుంది. బరువు తగ్గడంలో కూడా పెసరపప్పు ఉపయోగపడుతుంది. పెసరపప్పును ఉపయోగించి మనం రకరకాలల వంటలను, ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. పెసరపప్పుతో చేసే చారు చాలా రుచిగా ఉంటుంది. అయితే ఈ పెసర పప్పు చారును ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసరపప్పు చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – ఒక కప్పు, పసుపు – అర టీ స్పూన్, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – రెండు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – ఒకటి, తరిగిన టమాటాలు – 2, నూనె – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, చింతపండు రసం – రుచికి సరిపడా, నీళ్లు – 2 గ్లాసులు, కరివేపాకు – ఒక రెబ్బ.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు – 5, ఎండు మిరపకాయలు – 2, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పెసర పప్పు చారు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కడిగిన పెసరపప్పు, తరిగిన టమాటాలు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చి మిర్చి, పసుపు, ఒక టీ స్పూన్ నూనె, సరిపడా నీటిని పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తరువాత మూత తీసి రుచికి సరిపడా ఉప్పును, కారం వేసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత చింతపండు రసం, రెండు గ్లాసుల నీళ్లను పోసి కలుపుకోవాలి. తరువాత కరివేపాకు వేసి కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి 10 నిమిషాల పాటు చారును మధ్యస్ధ మంటపై ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక కొత్తిమీర తప్ప మిగిలిన పదార్థాలన్ని వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాళింపును ముందుగా తయారు చేసి పెట్టుకున్న చారులో వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత మళ్లీ పప్పు చారును 2 నిమిషాల పాటు మరిగించి, చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు చారు తయారవుతుంది. ఈ చారును వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉండడమే కాకుండా.. శరీరానికి చలువ చేస్తుంది.