Nuts : ప్రకృతి ప్రసాదించిన అతి బలమైన ఆహారాల్లో డ్రై నట్స్ ఒకటి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి మేలు చేసే కొవ్వులు, ప్రోటీన్స్ డ్రై నట్స్ లో అధికంగా ఉంటాయి. మనం ఎక్కువగా వేరు శనగ పప్పులు (పల్లీలు), వాల్ నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు, పిస్తా పప్పులు, పుచ్చ గింజల పప్పు, గుమ్మడి గింజల పప్పు, పొద్దు తిరుగుడు గింజల పప్పును అధికంగా వాడుతూ ఉంటాం. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. వీటిని మనం కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటూ ఉంటాం. ప్రస్తుత కాలంలో వీటిని గిప్ట్స్ రూపంలో, అలాగే మీటింగ్స్ లో కూడా ఇస్తూ ఉన్నారు.
ప్రతి రోజూ వీటిని ఆహారంగా తీసుకునే వారు కూడా ఉన్నారు. అయితే చాలా మందికి డ్రై నట్స్ ను నేరుగా తినడం మంచిదా లేదా నానబెట్టుకుని తినడం మంచిదా, ఎలా తినడం వల్ల మేలు కలుగుతుంది.. అనే సందేహాలు వస్తుంటాయి. డ్రై నట్స్ ను నేరుగా తినడం వల్ల శరీరానికి ఎటువంటి హాని కలగదు. వీటిని నేరుగా తినడంవల్ల అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు కూడా రావు. కానీ డ్రై నట్స్ లో 40 శాతం వరకు నూనె ఉంటుంది. వీటిని నేరుగా తినడం వల్ల నూనె కారణంగా వికారం కలిగే అవకాశాలు ఉంటాయి. కొందరికి వాంతులు కూడా అవ్వచ్చు.
వీటిలో కొన్ని గట్టిగా కూడా ఉంటాయి. వీటిని మనం సరిగ్గా నమలనప్పుడు, ఇవి జీర్ణం అవ్వక మలంలో అలాగే ముక్కలు ముక్కలుగా వస్తాయి. డ్రై నట్స్ ను నేరుగా తినడం వల్ల అవి సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల వాటిలో పోషకాలు శరీరానికి పూర్తిగా లభించవు. డ్రై నట్స్ ను నానబెట్టుకుని తినడం వల్ల త్వరగా జీర్ణమవుతాయి. వీటిని 6 నుండి 7 గంటల పాటు నీళ్లలో నానబెట్టుకుని తినడం వల్ల వీటిలో ఉండే నూనెలు పాలలాగా మారుతాయి. డ్రై నట్స్ ను నానబెట్టుకుని తినడం వల్ల వికారం కూడా కలగదు. డ్రైనట్స్ ను నేరుగా తినడం వల్ల శరీరానికి ఎటువంటి హాని కలగనప్పటికీ, వీటిని నానబెట్టుకుని తినడం వల్ల త్వరగా జీర్ణమయ్యి వీటిలో ఉండే పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. కనుక నట్స్‌ను ఎల్లప్పుడూ నీటిలో నానబెట్టి తింటే మంచిది. ఉదయం నానబెడితే సాయంత్రం లేదా రాత్రి నానబెడితే మరుసటి రోజు ఉదయం తినవచ్చు. ఇలా నానబెట్టిన నట్స్‌లో ఉండే పోషకాలన్నీ మనకు లభిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉంటాం.