Ragi Java : రాగులు.. మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇవి కూడా ఒకటి. ఇవి అత్యంత శక్తివంతమైన చిరు ధాన్యాలు. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి లభించే శక్తి అంతా ఇంతా కాదు. రాగులు ఇతర చిరుధాన్యాల కంటే చాలా బలవర్ధకమైనవి. రాగుల్లో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉన్నాయి. రాగులను రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. వీటిలో ఉండే అమైనో యాసిడ్లు త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి. బరువును నియంత్రిస్తాయి. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. అంతేకాకుండా జుట్టు పెరుగుదలలో కూడా రాగులు మనకు సహాయపడతాయి.
నడి వయసు స్త్రీలల్లో ఎముకలు పటుత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల వీటిలో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రాగులు నిద్రలేమిని, ఆందోళనను, వ్యాకులత వంటి సమస్యలను దూరం చేస్తాయి. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు రాగులను రోజూ వారి ఆహారంలో తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. మధుహేహంతో బాధపడే వారు రాగులతో చేసిన ఎటువంటి ఆహారాన్ని తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.
రాగులను వేయించి పొడిగా చేయాలి. ఈ పొడిని బియ్యంతో కలిపి వండుకుని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రాగి పిండితో జావను చేసి పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉండడంతో పాటు ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రాగి జావలో మజ్జిగను, ఉప్పును వేసి కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల నీరసం, ఆందోళన తగ్గడంతోపాటు శరీరానికి కూడా తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
రక్తహీనత సమస్యతో బాధపడే వారు రాగులను రోజూవారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. బాలింతలు రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల వారిలో పాల ఉత్పత్తి ఎక్కువవుతుంది. ఈ విధంగా రాగులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని.. వీటిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.