Karivepaku Pachadi : మనం వంటల తయారీలో ఉపయోగించే వాటిల్లో కరివేపాకు కూడా ఒకటి. కరివేపాకు వేయనిదే చాలా మంది వంట చేయరు అని చెప్పవచ్చు. కరివేపాకును వంటల్లో వాడడం వల్ల వంటల రుచి, వాసన పెరుగుతాయి. అంతేకాకుండా కరివేపాకును ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వంటల్లోనే కాకుండా కరివేపాకుతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకుతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కరివేపాకు – ఒక కప్పు, నూనె – ఒక టీ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 4 నుండి 6, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, నానబెట్టిన చింతపండు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 3, కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – చిటికెడు.
కరివేపాకు పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి కరకరలాడే వరకు వేయించాలి. తరువాత నువ్వులను వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా వేయించిన వాటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఉప్పు, నానబెట్టిన చింతపండు, తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి.
ఇలా తయారు చేసిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనెను వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తాళింపును ముందుగా తయారు చేసిన పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంట చేసే సమయం లేనప్పుడు లేదా కూరగాయలు లేనప్పుడు ఇలా కరివేపాకుతో పచ్చడిని చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.