Ragi Soup : చిరు ధాన్యాలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాలలో రాగులు కూడా ఒకటి. ఇవి ఎంతో బలవర్దకమైన ఆహారమని మనందరికి తెలుసు. రాగులను పిండిగా చేసి మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగిపిండితో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. వీటిలో ఉండే క్యాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు సహాయపడతుంది. రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగుతుంది. రాగుల్లో ఐయోడిన్ పుష్కలంగా ఉంటుంది. రాగులను వేయించి పొడిగా చేయాలి. ఈ పొడిని ఎదిగే పిల్లలకు పాలల్లో కలిపి ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.
మధుమేహం వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగి గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం దివ్యౌషధంగా పని చేస్తాయి. మధుమేహ వ్యాధి గ్రస్తులు రాగి పిండితో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నూతన శక్తి లభిస్తుంది. కడుపులో మంటను తగ్గించి చలువ చేస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. రాగుల్లోని రక్తహీనతను తగ్గించడంలో దోహదపడుతుంది. వీటిలో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకలను ధృడంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో సహాయపడతాయి. రాగుల్లో ఉండే ఆమైనో ఆమ్లాలు ఆకలిని తగ్గిస్తాయి. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల వయసు పెరిగే కొద్ది వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
ప్రతిరోజూ రాగి మాల్ట్ ను తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. రాగులతో త్వరగా చేసుకునే ఆహారం రాగి మాల్ట్. మనకు సూపర్ మార్కెట్ లలో కూడా రాగి పిండి లభిస్తుంది. కానీ కాస్త తీరిక చేసుకుంటే దీనిని మనం చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా రాగులను 18 గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీటిని తీసేసి ఒక పలుచటి వస్త్రంలో వేసి మూటకట్టాలి. ఈ మూటను గాలి తగిలే చోట ఉంచి అప్పుడప్పుడూ మూటపై నీటిని చల్లుతూ ఉండాలి. ఒకటి నుండి మూడు రోజుల్లో మూటల్లోని రాగులు మొలకెత్తుతాయి. వీటిని ఎండలో ఆరబెట్టాలి. ఆ తరువాత సన్నటి మంటపై దోరగా వేయించాలి. ఆ తరువాత పొడిగా చేసుకోవాలి. సువాసన కొరకు యాలకులను కూడా వేసుకోవచ్చు. ఈ పొడిని ఆలి తగలకుండా నిల్వ చేసుకోవాలి.
తరువాత ఒక గ్లాస్ నీటిలో రెండు టీ స్పూన్ల రాగి మాల్ట్ పొడిని వేసి మరిగించాలి. తరువాత పాలను పోసి ఉప్పు లేదా చక్కెర వేసి జావలాగా చేసుకోవచ్చు. మాల్ట్ చేయడం వల్ల దీనిలో ఉండే పోషకాలు వృద్ధి చెందుతాయి. రాగి మాల్ట్ లో ఎమలైజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనిని జీర్ణశక్తి పెంపొదిస్తుంది. ఈ రాగి మాల్ట్ ను అందరూ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు దీనిని తప్పకుండా ఇవ్వాలి. రాగి మాల్ట్ తో జావనే కాకుండా రొట్టె, సంగటి, పాయసం, లడ్డు, దోశ, బర్ఫీ వంటి వాటిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా సాధారణ రాగులతో చేసిన జావ కంటే మొలకెత్తించిన రాగులతో చేసిన జావను తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.