Tomato Vepudu Pappu : మనం వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే పప్పులలో కంది పప్పు ఒకటి. కంది పప్పు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కంది పప్పును ఉపయోగించి మనం రకరకాల పప్పు కూరలను తయారు చేస్తూ ఉంటాం. అందులో టమాటా పప్పు ఒకటి. టమాటా పప్పు చాలా రుచిగా ఉంటుంది. మనం తరుచూ చేసే టమాటా పప్పుకు బదులుగా కింద చెప్పిన విధంగా తయారు చేసే టమాటా పప్పు కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని వేపుడు పప్పు, ఎండు మిరపకాయల పప్పు అని కూడా అంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ టమాటా పప్పును ఎలా తయారు చేసుకోవాలో.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట వేపుడు పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కంది పప్పు – పావు కిలో, తరిగిన టమాటాలు – 2 (పెద్దవి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ధనియాలు – పావు టీ స్పూన్, కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు – 10, తరిగిన ఉల్లిపాయలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), ఎండు మిరపకాయలు – 12, కరివేపాకు – రెండు రెబ్బలు, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, చింత పండు – 10 గ్రా., నీళ్లు – అర లీటర్, ఉప్పు – రుచికి సరిపడా.
టమాటా వేపుడు పప్పు తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ నూనె లో వేసి కాగాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మెంతులు, ధనియాలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలపాటు వేయించుకోవాలి. తరువాత ఎండు మిరపకాయలను పెద్ద పెద్ద ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక కందిపప్పు, కరివేపాకు, పసుపును వేసి కంది పప్పును ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. కంది పప్పు వేగాక టమాట ముక్కలను, ధనియాల పొడి, కారం, కొద్దిగా నీటిని పోసి కలిపి, టమాటా ముక్కలు కొద్దిగా ఉడికే వరకు ఉంచాలి. తరువాత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, నీళ్లను పోసి, మూత పెట్టి, మధ్యస్థ మంటపై నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తరువాత పప్పు గుత్తి, లేదా గంట సహాయంతో ఎండు మిరపపకాయలను, వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా మెత్తగా చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే టమాటా వేపుడు పప్పు తయారవుతుంది. వేడి వేడి అన్నంలో, రాగి సంగటితో ఈ పప్పును కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.