జ్ఞాపకశక్తి లోపం అనే సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంది. తాజాగా నేర్చుకున్న విషయాలను గానీ లేదా పూర్వం జరిగిన సంఘటనల తాలూకు వివరాలు, ఇతర విషయాలను సరిగ్గా గుర్తుంచుకోలేకపోతుంటారు. కొందరికి మతిమరుపు సమస్య కూడా దీంతోపాటు కలిపి ఉంటుంది. జ్ఞాపకశక్తి లోపం సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.
తలకు దెబ్బలు తగలడం, మద్యం అతిగా సేవించడం, ఫిట్స్, ఆందోళన, ఒత్తిడిని ఎక్కువ కాలం పాటు అనుభవించడం, అల్జీమర్స్ వ్యాధి, మెదడులో పెరుగుదలలు, విటమిన్ బి1, బి12 లోపాలు, మధుమేహం, థైరాయిడ్ వ్యాధులు, సిఫిలిస్, ఎయిడ్స్ వంటి కారణాల వల్ల జ్ఞాపకశక్తి లోపం సమస్య వస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఆ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. ఉసిరిక పొడి 2 గ్రాములు, నువ్వుల పిండి 2 గ్రాములు, తేనె, నెయ్యిలను కొద్ది కొద్దిగా తీసుకుని కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని రోజుకు రెండు సార్లు 40 రోజుల పాటు తీసుకోవాలి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు తగ్గుతుంది.
2. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను తాగుతుండాలి. లేదా ఉసిరిక పొడిని 2 గ్రాముల మోతాదులో తేనెతో లేదా నీళ్లతో కలిపి తీసుకోవచ్చు. ఉసిరికాయలతో చేసే మురబ్బాలను కూడా తినవచ్చు.
3. అతి మధురం వేర్లను మెత్తగా నూరి పొడి చేసి 1 గ్రాము మోతాదులో తీసుకుని దానికి నీళ్లు కలపాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తీసుకోవాలి.
4. ప్రతి రోజూ 5-10 నానబెట్టిన బాదం గింజలను తింటుండాలి.
5. తిప్పతీగ రసాన్ని రోజుకు 10-20 ఎంఎల్ మోతాదులో రెండు సార్లు తీసుకోవాలి.
6. శంఖపుష్పి మొక్క పంచాంగ స్వరసాన్ని 10 ఎంఎల్ మోతాదులో తీసుకుని దానికి తేనె కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని రోజుకు ఒకసారి తీసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు తగ్గుతుంది.
ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడం, మెదడుకు పనిపెట్టే పజిల్స్‌ను నింపడం, పుస్తకాలను చదవడం, పాలు, నెయ్యిలను తీసుకోవడం, వెండి పాత్రల్లో ఆహారాలను తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.