వేడి వేడిగా మొక్కజొన్నల సూప్.. ఇలా తయారు చేసి తాగితే మేలు..!

మొక్కజొన్నలు మనకు ఈ సీజన్‌లో విరివిగా లభిస్తాయి. వాటిని చాలా మంది ఉడకబెట్టుకుని లేదా కాల్చి తింటారు. కొందరు వాటితో గారెలను చేసుకుంటారు. అయితే మొక్కజొన్నలతో వేడి వేడిగా సూప్‌ చేసుకుని తాగవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆ సూప్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

here it is how you can make healthy corn soup

మొక్కజొన్నల సూప్‌ తయారీకి కావల్సిన పదార్థాలు

  • తాజా మొక్కజొన్న కండెలు – 5
  • నీళ్లు – 5 కప్పులు
  • అల్లం ముక్క – 1 అంగుళం ఉన్నది (సన్నగా తరగాలి)
  • కొత్తిమీర – 1 టేబుల్‌ స్పూన్‌ (తరిగినది)
  • నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్స్‌
  • జీలకర్ర – 1 టీస్పూన్‌
  • మిరియాలు – పావు టీస్పూన్‌ (పొడి)
  • ఉప్పు – రుచికి సరిపడా

మొక్కజొన్నల సూప్‌ తయారు చేసే విధానం

ముందుగా మొక్కజొన్న కండెలను బాగా కడిగి గింజలు వలిచి నాలుగు కప్పులు తీసుకోవాలి. వీటిని గ్రైండర్‌ లేదా బ్లెండర్‌లో వేసి రెండు కప్పుల నీళ్లు చేర్చి మెత్తగా రుబ్బాలి. ఒక బౌల్‌లో తీసుకుని పక్కన పెట్టాలి. తరువాత అల్లం, కొత్తిమీర ఆకులను గ్రైండర్‌లో వేసి పావు కప్పు నీళ్లు కలిపి నిమిషం పాటు మెత్తగా పట్టుకోవాలి. సూప్‌ తయారీ కోసం వాడే గిన్నెను స్టవ్‌ మీద చిన్న మంట మీద ఉంచి కొద్దిగా వేడెక్కిన తరువాత నెయ్యి, జీలకర్ర వేయాలి. గింజలు పగిలి విచ్చుకున్న తరువాత అల్లం ముద్దను, మొక్కజొన్న – కొత్తమీర ముద్దను, మిరియాలను కలపాలి. ఇప్పుడు మిగిలిన నీళ్లను చేర్చి బాగా కలపాలి. తరువాత పాత్ర మీద మూత పెట్టకుండా 10-15 నిమిషాల పాటు ఉడికించాలి.

మధ్య మధ్యలో కలుపుతుండడం మరిచిపోకూడదు. సర్వ్‌ చేయబోయే ముందు రుచిని బట్టి, అవసరాన్ని బట్టి ఉప్పు కలపాలి. సూప్‌ మీద కొత్తిమీర ఆకులను, మిరియాల పొడిని చిలకరించాలి. దీంతో కార్న్‌ సూప్‌ రెడీ. ఇలా తయారు చేసిన సూప్‌ను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ లేదా సాయంత్రం స్నాక్స్‌ సమయంలో తీసుకోవచ్చు. దీని వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ సూప్‌ను తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. నీరసంగా, అలసటగా ఉండే వారికి శక్తి లభిస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Admin

Recent Posts