Beauty Tips : మనలో చాలా మందికి మెడ, మోచేతులు, మోకాళ్ల దగ్గర చర్మం ఎక్కువగా నల్లగా ఉంటుంది. కొందరు తెల్లగా ఉన్నప్పటికీ ఈ భాగాలలో నల్లగా ఉండడాన్ని మనం చూడవచ్చు. కొందరిలో అనారోగ్య సమస్యల వల్ల కూడా మెడ భాగంలో చర్మం నల్లగా మారుతుంది. ఈ భాగాలలో చర్మం తెల్లగా మారడం కోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అధిక ధరను వెచ్చించి మరీ మనం రకరకాల క్రీములను కొనుగోలు చేసి వాడుతూ ఉంటాం. అయినప్పటికీ ఆశించిన ఫలితాన్ని మనం పొందలేక పోతుంటాం.
అంతే కాకుండా వీటిని వాడడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇంటి చిట్కాల ద్వారా చాలా సులువుగా మనం నల్లగా ఉండే చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు. ఇంట్లో వాడే పదార్థాలతో మిశ్రమాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల చర్మం తెల్లగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిశ్రమం తయారీ కోసం రెండు టీ స్పూన్ల కాఫీ పౌడర్ ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఒక సగం చెక్క నిమ్మరసం, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ ను వేసి కలుపుకోవాలి. దీనిని మెడ భాగం, మోచేతులు, మోకాళ్ల దగ్గర నెమ్మదిగా రాస్తూ మర్దనా చేసుకోవాలి. 10 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల నల్లగా ఉండే చర్మం తెల్లగా మారుతుంది. కాఫీ పౌడర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, నిమ్మరసం, గులాబీ నీరులో ఉండే ఔషధ గుణాలు నల్లగా ఉండే చర్మాన్ని తెల్లగా మార్చడంలో సహాయపడతాయి. దీని వల్ల ఆయా భాగాల్లో చర్మం తెల్లగా మారుతుంది. మళ్లీ పూర్వ రూపాన్ని పొందుతుంది.