Fenugreek Seeds : మన వంటింట్లో ఉండాల్సిన దినుసుల్లో మెంతులు కూడా ఒకటి. మనం మెంతులను నిల్వ పచ్చళ్ల తయారీలో, పులుసు కూరల తయారీలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. మెంతులతో పాటు మెంతికూరను కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మెంతికూరతో పప్పు, పరోటా వంటి వంటకాలు చేయడంతో పాటు చక్కటి వాసన కొరకు వంటల్లో వేస్తూ ఉంటాం. చేదుగా ఉండే ఈ మెంతుల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయని వీటిని వాడడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెంతులు మన ఆరోగ్యంతో పాటు సౌందర్యాన్ని పెంచడంలో కూడా ఎంతో దోహదపడతాయి. మెంతుల్లో అలాగే మెంతి ఆకుల్లో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే వీటి వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి ఆకులను మెత్తగా నూరి తలకు పట్టించాలి. ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గడంతో పాటు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. అదే విధంగా మెంతి ఆకులను మెత్తగా నూరి రొమ్ములపై లేపనంగా రాయాలి. అలాగే ఏదో ఒక రూపంలో మెంతులను, మెంతి కూరను ఆహారంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాలింతల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అలాగే మెంతి ఆకులను, తులసి ఆకులను మెత్తగా నూరి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మొటిమల వల్ల కలిగే మచ్చలు, గుంతలు, నల్ల మచ్చలు, ముడతలు వంటి చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ఒక టీ స్పూన్ మెంతులను రోజూ పరగడుపున తినాలి. వీటిని నేరుగా తినలేని వారు పెరుగులో నానబెట్టుకుని లేదా మెంతుల పొడిని మజ్జిగలో కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల డయాబెటిస్ తో పాటు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.
ఈ చిట్కాను పాటిస్తూనే ఆహార నియమాలను పాటించాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఉండాలి. అదే విధంగా రక్తపు గడ్డలను, చీము గడ్డలను తగ్గించడంలో కూడా మెంతులు మనకు ఉపయోగపడతాయి. మెంతులను నానబెట్టి పేస్ట్ గా చేయాలి. తరువాత ఈ పేస్ట్ ను గడ్డలపై లేపనంగా రాయాలి. ఇలా చేయడం వల్ల గడ్డలు పగిలి పక్వానికి వస్తాయి. నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే మెంతులను నానబెట్టి పేస్ట్ గా చేయాలి. తరువాత ఈ పేస్ట్ కు గోరంటాకును కలిపి మరలా మెత్తగా నూరాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కాళ్ల పగుళ్లపై రాయాలి. దీని వల్ల కాళ్ల పగుళ్లు త్వరగా తగ్గుతాయి. అలాగే ఈ మిశ్రమాన్ని అరికాళ్లు, అరి చేతుల్లో రాసుకోవడం వల్ల మంటలు కూడా తగ్గుతాయి. అలాగే మెంతులను పొడిగా చేయాలి. ఈ పొడికి తగినన్ని నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ ను ముళ్లు గుచ్చుకున్న చోట రాసి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల కొంత సమయం తరువాత ముళ్లు దానంతట అదే బయటకు వస్తుంది.
ఒక భాగం శొంఠి పొడికి మూడు భాగాల మెంతిపిండిని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా అర టీ స్పూన్ మోతాదులో తేనెతో కలిపి తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. అదే విధంగా మెంతుల పిండికి సమానంగా నల్ల ఉలవల పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని పూటకు ఒక టీ స్పూన్ మోతాదులో మూడు పూటలా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు. మెంతులు, మినుములు, ఉసిరికాయలు.. ఈ మూడింటిని సమానంగా పొడి రూపంలో ఒక గిన్నెలో తీసుకోవాలి. తరువాత ఈ పొడి మునిగే వరకు నిమ్మరసాన్ని పిండాలి. దీనిని పేస్ట్ గా చేసుకుని తలకు పట్టించాలి.
ఆరిన తరువాత కుంకుడుకాయలు లేదా షీకా కాయలతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి. మెంతులు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో అజీర్తి, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటప్పుడు దానిమ్మ పండ్లు, అల్లం వంటి వాటిని తీసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలు వీటిని వాడకపోవడమే మంచిది. ఈ విధంగా మెంతులు మనకు ఉపయోగపడతాయని వీటిని వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.