Tomato Pesarapappu Kura : మనం పెసరపప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెసరపప్పు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెసరపప్పు శరీరానికి చలువ చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిప్తాయి. పెసరపప్పుతో ఎక్కువగా చేసే వంటకాల్లో టమాట పెసరపప్పు కూర కూడా ఒకటి. ఈ పప్పు కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. రుచిగా, తేలికగా టమాట పెసరపప్పు కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పెసరపప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – 100 గ్రా., తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, నీళ్లు – ఒక గ్లాస్, తరిగిన టమాటాలు – 4, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, దంచిన మిరియాలు – పావు టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1.
టమాట పెసరపప్పు తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, నీళ్లు పోసి మూత పెట్టాలి. ఈ పప్పును మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం, మరో అర గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. ఈ పప్పును స్టవ్ మీద ఉంచి మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక్కొక్కటిగా తాళింపు పదార్థాలన్నింటిని వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత ముందుగా ఉడికించుకున్న పప్పును వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పెసరపప్పు కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. కంది పప్పుకు బదులుగా ఇలా పెసరపప్పుతో పప్పు కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.