Cold : సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే మనకు దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే చలికాలంలో ఈ సమస్యలు మనల్ని మరిన్ని ఎక్కువ ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఈ సీజన్‌లో ఇవి వస్తే ఒక పట్టాన తగ్గవు. కానీ కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల దగ్గు, జలుబు నుంచి సత్వరమే ఉపశమనం పొందవచ్చు. శ్వాస సరిగ్గా ఆడుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. శొంఠి చూర్ణం పావు టీ స్పూన్, పిప్పళ్ళ చూర్ణం పావు టీ స్పూన్, మిరియాల చూర్ణం పావు టీ స్పూన్, అరకప్పు వేడి నీళ్ళు తీసుకోండి. అన్నింటినీ కలిపి తాగండి. జలుబు సమస్య తగ్గుతుంది. జలుబు తీవ్రతను బట్టి రోజుకు రెండు పూటలు లేదా మూడు పూటలు వరుసగా నాలుగైదు రోజులు తాగాలి.
2. గుప్పెడు తులసి ఆకులు, ఒక టీ స్పూన్ మిరియాలు, ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు, రెండు కప్పుల నీళ్ళు తీసుకోండి. అన్నింటినీ కలిపి స్టవ్ మీద పెట్టి ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరిగించండి. తర్వాత వడపోసుకొని సగం కప్పు కషాయం ఉదయం, సగం కప్పు కషాయం రాత్రి గోరు వెచ్చగా తాగాలి. సమస్య తీవ్రతను బట్టి నాలుగైదు రోజులు వాడాలి. దీంతో జలుబు పూర్తిగా తగ్గిపోతుంది.
పై రెండు చిట్కాలను పాటించడం వల్ల జలుబు నుంచి సులభంగా బయట పడవచ్చు. అవసరం అయినంత మేర వాటిని వాడుకోవాలి. 4 లేదా 5 రోజుల్లో జలుబు ఇట్టే తగ్గిపోతుంది. అంతకన్నా ఎక్కువ రోజుల పాటు దగ్గు, జలుబు ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.