చిట్కాలు

వంట ఇంటి ఔష‌ధం ల‌వంగాలు.. ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చంటే..?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ల‌వంగాలను త‌మ వంట ఇంటి మ‌సాలా దినుసుగా ఉప‌యోగిస్తున్నారు. అనేక ర‌కాల వంట‌ల్లో వీటిని వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే లవంగాల వ‌ల్ల నిజానికి మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిల్లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఎన్నో ఉంటాయి. అయోడిన్‌, కాల్షియం, ఫాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్ త‌దిత‌ర పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల లవంగాలు మ‌న‌కు మేలు చేస్తాయి. వీటి వ‌ల్ల ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

home remedies using cloves home remedies using cloves

1. డ‌యాబెటిస్ స‌మ‌స్య ఉన్న‌వారికి లవంగాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి. 2006లో డాక్ట‌ర్ ఆలం ఖాన్ అనే సైంటిస్టు చేపట్టిన అధ్య‌య‌నం ప్ర‌కారం ల‌వంగాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయని, డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంద‌ని వెల్ల‌డైంది. ల‌వంగాలు మ‌న శ‌రీరంలో ఇన్సులిన్‌లా ప‌నిచేస్తాయి. దీంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గుతుంది. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 టీస్పూన్ ల‌వంగాల పొడిని క‌లిపి తాగుతుంటే డ‌యాబెటిస్‌ను అదుపు చేయ‌వ‌చ్చు. లేదా ఆహారంపై ల‌వంగాల పొడి చ‌ల్లుకుని కూడా తీసుకోవ‌చ్చు. దీంతోనూ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

2. ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. గ్యాస్ త‌గ్గుతుంది. శ‌రీరంలోని వాపులు త‌గ్గుతాయి. జీర్ణాశ‌యంలో ఉండే సూక్ష్మ క్రిములు న‌శిస్తాయి. రోజూ మూడు పూట‌లా భోజ‌నం చేసిన వెంట‌నే ఒక ల‌వంగాన్ని నోట్లో పెట్టుకుని న‌ములుతూ ఉండాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

3. అసిడిటీ స‌మ‌స్య ఉన్న‌వారు ల‌వంగాల‌ను రోజూ తీసుకోవాలి. దీంతో జీర్ణాశ‌య గోడ‌ల‌పై మ్యూక‌స్ చేరుతుంది. ఇది అసిడిటీని త‌గ్గిస్తుంది. భోజ‌నం చేసిన వెంట‌నే ల‌వంగాన్ని తిన‌డం వ‌ల్ల అసిడిటీ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ ప్ర‌చురించిన ఓ అధ్య‌య‌నం ప్ర‌కారం ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్‌ను గ‌ణనీయంగా త‌గ్గించుకోవ‌చ్చు. ర‌క్తంలో ఉండే ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్‌), ట్రై గ్లిజ‌రైడ్లు త‌గ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

5. ల‌వంగాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. ఇవి వాపుల‌ను, నొప్పుల‌ను త‌గ్గిస్తాయి. లవంగాల‌ను న‌మిలి తిన‌డం వ‌ల్ల నోట్లో ఉండే బాక్టీరియా న‌శిస్తుంది. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు, చిగుళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి.

6. ల‌వంగాల్లో యుజినాల్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది ఎక్స్‌పెక్టోరెంట్ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల ల‌వంగాల‌ను తింటే శ్వాస కోశ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ముఖ్యంగా సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే ల‌వంగాల్లో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఇన్ఫెక్ష‌న్ల‌ను త‌గ్గిస్తాయి. ఆయుర్వేద ప్ర‌కారం లవంగాల్లో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. అవి ద‌గ్గు, జ‌లుబును త‌గ్గిస్తాయి. ప్లీహం త‌గ్గుతుంది. ఒక పాత్ర‌లో 200 ఎంఎల్‌ నీటిని తీసుకుని అందులో నాలుగు ల‌వంగాలు, ఒక మిరియ‌పు గింజ‌, కొద్దిగా తుల‌సి ఆకుల ర‌సం వేసి మ‌రిగించాలి. నీరు స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించాక ఆ నీటిని వ‌డ‌క‌ట్టి అందులో కొద్దిగా తేనె క‌లిపి గోరు వెచ్చ‌గా ఉండగానే తాగేయాలి. అవ‌స‌రం అనుకుంటే అందులో అల్లం వేసి కూడా మరిగించ‌వ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని తాగితే శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

7. ల‌వంగాలు స‌హ‌జ‌సిద్ధ‌మైన పెయిన్ కిల్ల‌ర్‌లా ప‌నిచేస్తాయి. వీటిల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి క‌నుక కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ఆర్థ‌రైటిస్ నొప్పుల నుంచి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. ఒక పెనం తీసుకుని దానిపై కొన్ని లవంగాల‌ను వేసి వేయించాలి. వాటిని ఒక వ‌స్త్రంలో చుట్టి ఆ వ‌స్త్రంతో కాప‌డం పెట్టాలి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే ల‌వంగాల‌ను పొడి చేసి కూడా వ‌స్త్రంలో చుట్టి కాప‌డం పెట్టుకోవ‌చ్చు. ల‌వంగ నూనెతో మ‌ర్దనా చేస్తున్నా నొప్పులు త‌గ్గుతాయి.

8. ల‌వంగాల్లో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు గొంతు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. ఒక టీస్పూన్ తేనెలో ఒక ల‌వంగాన్ని 8 గంట‌ల పాటు ఉంచాలి. త‌రువాత ఆ తేనెను తాగాలి. దీంతో గొంతు నొప్పి, ఇత‌ర స‌మ‌స్య‌లు తగ్గుతాయి.

9. ల‌వంగాలు ఘాటు సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. దీని వ‌ల్ల మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌నను తగ్గిస్తాయి. ల‌వంగాల నూనెను కొద్దిగా నీటిలో క‌లిపి దాంతో స్నానం చేస్తే శ‌రీరం, మ‌న‌సు రిలాక్స్ అవుతాయి. ఉత్సాహంగా, చురుగ్గా మారుతారు. అల‌స‌ట‌, నీర‌సం త‌గ్గుతాయి.

10. మొటిమ‌ల‌ను తగ్గించ‌డంలో ల‌వంగాలు బాగా ప‌నిచేస్తాయి. వాటిల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. క‌నుక చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. ల‌వంగాల పొడి, తేనె, నిమ్మ‌ర‌సంల‌ను కొద్ది కొద్దిగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాలు ఆగి క‌డిగేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts