మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. అన్ని పోషకాలు కలిగిన సమతుల ఆహారాన్ని రోజూ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఎక్కువ రోజుల పాటు జీవించగలుగుతాం. వృద్ధాప్యంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే ఎక్కువ రోజుల పాటు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎక్కువ కాలం పాటు జీవించాలన్నా రోజూ 5 సార్లు పండ్లు, కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు హార్వార్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు.
రోజూ 2 సార్లు పండ్లు, 3 సార్లు కూరగాయలను తింటే ఎక్కువ కాలం పాటు జీవించవచ్చని, అనారోగ్యాలు రావని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మందికి చెందిన వివరాలను అధ్యయనం చేసి సైంటిస్టులు ఆ విషయాలను వెల్లడించారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన సర్క్యులేషన్ అనే జర్నల్‌లో ఈ వివరాలను ప్రచురించారు.
రోజూ 2 సార్ల కన్నా 5 సార్లు పండ్లు, కూరగాయలు తినే వారు అనారోగ్యాలతో చనిపోయే అవకాశాలు 13 శాతం తక్కువగా ఉంటాయని, అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్స్‌తో చనిపోయే అవకాశాలు 12 శాతం వరకు తక్కువగా ఉంటాయని తేల్చారు. ఇక క్యాన్సర్‌తో అయితే 12 శాతం, శ్వాసకోశ వ్యాధులతో చనిపోయే అవకాశాలు 35 శాతం వరకు తక్కువగా ఉంటాయని చెప్పారు. అందువల్ల రోజుకు 5 సార్లు పండ్లు, కూరగాయలను తినాలని సూచిస్తున్నారు.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ప్రజలకు రోజుకు కనీసం 4 లేదా 5 సార్లు అయినా సరే పండ్లు, కూరగాయలను తినాలని సూచిస్తోంది.
రోజుకు 2 సార్లు పండ్లు, 3 సార్లు కూరగాయలను తినడం వల్ల ఎక్కువ రోజులు జీవించవచ్చు. ఒక సారికి 75 గ్రాముల పండ్లను అయినా తినాలి. అలా మొత్తం కూరగాయలు, పండ్లు కలిపి 5 సార్లు అంటే 75 * 5 = 375 గ్రాముల మేర రోజూ ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. దీంతో అనేక రకాల వ్యాధులు రాకుండా ఎక్కువ రోజుల పాటు ఆరోగ్యంగా జీవించవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365