సీజన్లు మారే సమయంలో తప్పనిసరిగా అందరికీ ఒకసారి జలుబు చేస్తుంది. ప్రస్తుతం చలికాలం ముగిసి వేసవి సీజన్ ప్రారంభంలో ఉంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు మరీ తక్కువగా ఉంటున్నాయి. చలి బాగా ఇబ్బంది పెడుతోంది. మరోవైపు పగలు ఎండ దంచి కొడుతోంది. ఇలా అసమాన వాతావరణం ఉండడం వల్ల చాలా మందికి శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా అధిక శాతం మంది జలుబుతో బాధపడుతున్నారు. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. పలు ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు, జలుబు నుంచి త్వరగా బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జలుబుతో బాధపడుతుంటే తేనె కలిపిన నిమ్మరసం తీసుకోవాలి. జలుబును తగ్గించేందుకు ఈ మిశ్రమం ఎంతగానో పనిచేస్తుంది. తేనెలో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అలాగే నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. అందువల్ల ఈ రెండింటినీ కలిపి రోజుకు 3 పూటలా ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటూ ఉంటే జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. శ్వాస సరిగ్గా ఆడుతుంది. అలాగే జలుబు, దగ్గు తగ్గాలంటే టీ స్పూను శొంఠి, టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని ఒక్కో కప్పు చొప్పున రోజుకు మూడు, నాలుగు సార్లు తాగాలి.
జలుబు ఎక్కువై గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంటే ఛాతీలో నుండి శబ్దం వస్తున్నట్లయితే ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో రెండు వెల్లుల్లి రేకులను చిదిమి వేసుకొని తాగాలి. ఇలా మూడు రోజులు చేస్తే ఫలితం ఉంటుంది. జలుబుతో బాధపడుతూ ముక్కు పట్టేసినట్టుంటే మరిగే నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టుకుంటే జలుబు తగ్గుముఖం పట్టడమే కాకుండా యాంటిబయాటిక్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా జలుబు నుంచి సులభంగా బయట పడవచ్చు.