Lice : మనలో చాలా మంది తలలో పేల సమస్యతో బాధపడుతూ ఉంటారు. పేలు మనకు ఎంతో చికాకుకు కలిగిస్తాయి. వీటి కారణంగా తలలో విపరీతమైన దురద ఉంటుంది. వీటి కారణంగా ఒక్కొసారి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. సాధారణంగా పేలు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. పేలు 28 రోజుల వరకు మాత్రమే జీవిస్తాయి. ఆడ పేను పుట్టిన పదవ రోజు నుండి గుడ్లు పెట్టడాన్ని ప్రారంభిస్తాయి. రోజుకు 4 నుండి 5 గుడ్లు పెడతాయి. ఒక పేను దాదాపు 40 నుండి 125 గుడ్లు పెట్టే అవకాశం ఉందట. అలాగే పెట్టిన గుడ్లు తలలో నుండి రాలిపోకుండా ఉండడానికి గానూ ఆడ పేను జిగురును ఉత్పత్తి చేసి దానిని వెంట్రుకలకు రాస్తుందట. తరువాత పెట్టిన గుడ్లను వెంట్రుకలకు అతికిస్తుందట.
జిగురుకు అతుకుని ఉండడం వల్ల మనం తలస్నానం చేసినప్పటికి గుడ్లు రాలిపోకుండా ఉంటాయి. అలాగే 57 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు పేలు తట్టుకుని జీవిస్తూ ఉంటాయి. చాలా మంది పేల సమస్య నుండి బయటపడడానికి మార్కెట్ లో లభించే షాంపులను, మందులను వాడుతూ ఉంటారు. వీటి వల్ల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజ సిద్దంగా కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. వేపాకును లేదా వేపనూనెను వాడడం వల్ల పేల సమస్య తగ్గుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. వేప నూనెను వాడడం వల్ల మరింత త్వరగా ఈ సమస్య నుండి బయటపడవచ్చని వారు చెబుతున్నారు. వేపనూనెను తల చర్మానికి, జుట్టు కుదుళ్లకు అంటేలా చక్కగా రాయాలి.
ఇలా వేపనూనెను రాసిన 10 నిమిషాల్లోనే గుడ్లు చనిపోతున్నాయని అలాగే 15 నిమిషాల్లోనే పేలన్నీ చనిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వేపనూనె మనకు షాపుల్లో, అలాగే ఆన్ లైన్ లో సులభంగా లభిస్తుంది. దీనిని తలకు రాసుకుని అర గంట నుండి గంట పాటు అలాగే ఉండాలి. తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల పేల సమస్య నుండి చాలా సులభంగా విముక్తి లభిస్తుంది. ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుస్ప్రభావాలు కూడా ఉండవు.