Mouth Ulcer Natural Remedies : మనలో చాలా మందికి అప్పుడప్పుడు నోట్లో పొక్కులు, పుండ్లు ఏర్పడుతాయి. కొందరు వీటిని నంజు గుల్లలు అని కూడా అంటారు. ఇవి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అలర్జీలు, హార్మోన్లలో మార్పులు, జీర్ణాశయ ఇన్‌ఫెక్షన్లు ఉంటే నోట్లో పుండ్లు ఏర్పడుతాయి. వీటినే మౌత్ అల్సర్లు అని కూడా అంటారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నోట్లో పుండ్లు ఏర్పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. తినేటప్పుడు, తాగేటప్పుడు సమస్యగా అనిపిస్తుంది. ఇవి ఎక్కువగా బుగ్గలకు లోపలి వైపు ఏర్పడుతుంటాయి. అయితే నోట్లో పుండ్లు ఏర్పడిన కొందరిలో జ్వరం కూడా వస్తుంది. ఇవి సహజంగా అయితే 3 వారాల్లోగా తగ్గిపోతాయి. కానీ ఎంతకూ తగ్గకపోతే డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. అయితే నోట్లో పుండ్లను తగ్గించేందుకు పలు ఇంటి చిట్కాలను పాటించవచ్చు. ముఖ్యంగా తులసి ఆకులను తినడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
తులసి దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఉంటుంది. అందువల్ల ఇది సులభంగా లభిస్తుందని చెప్పవచ్చు. నోట్లో పుండ్లను తగ్గించడంలో తులసి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. తులసి ఆకులను తినడం వల్ల ఇతర అనేక వ్యాధులు కూడా నయం అవుతాయి. తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నోట్లోని అల్సర్లను తగ్గిస్తాయి. అదేవిధంగా నోట్లో పుండ్లను తగ్గించడంలో గసగసాలు కూడా పనిచేస్తాయి. ఉదయాన్నే పరగడుపునే 1 టీస్పూన్ గసగసాలను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తాగుతుండాలి. ఇలా చేస్తుంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరినూనె, కొన్ని నీళ్లు కలిపి నోట్లో పోసుకుని 10 నిమిషాల పాటు బాగా పుక్కిలించాలి. ఇలా రోజూ చేస్తుంటే నోట్లోని పుండ్లు తగ్గిపోతాయి. అలాగే రాత్రిపూట ఒక టీస్పూన్ కొబ్బరినూనెను తీసుకోవచ్చు. ఇలా కూడా సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా అతి మధురం చూర్ణాన్ని తేనెతో కలిపి నోట్లోని పుండ్లపై అప్లై చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే నోట్లోని పుండ్లు తగ్గిపోతాయి. అలాగే గోరు వెచ్చని నీళ్లలో కాస్త పసుపు వేసి కలిపి ఆ నీళ్లను నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేస్తున్నా కూడా నోట్లోని పుండ్లను తగ్గించుకోవచ్చు. ఈ విధంగా పలు ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.