కల్తీకి కాదేదీ అనర్హం అనే రేంజ్ లో సాగుతుంది కల్తీ దందా..తాజాగా కోడిగుడ్లను కూడా కల్తీ చేసి పారేస్తున్నారు మనోళ్లు. కొన్ని ప్రత్యేక పదార్థాలను, రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తున్న ఈ నకిలీ కోడిగుడ్లు ఎక్కువగా చైనాలో తయారవుతున్నాయట. మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వీటిని విక్రయిస్తున్నట్టు తాజాగా తెలిసింది. సాధారణ కోడిగుడ్ల కన్నా తక్కువ ధరకే వస్తుండడంతో వ్యాపారులు వీటిని మామూలు కోడిగుడ్లలో కలిపి అమ్ముతున్నట్టు సమాచారం. అసలు ఇంతకీ వాటిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. గ్లూకోలాక్టేన్, బెంజోయిక్ యాసిడ్, సెల్యులోజ్, ఆలం, అమైనో యాసిడ్, సోడియం అల్జినేట్, గెలాటిన్ వంటి పదార్థాలను ఉపయోగించి ముందుగా పచ్చసొన, తెల్లసొనలను విడి విడిగా తయారు చేస్తారు. పచ్చసొన అచ్చం గుడ్డు సొనలా కనిపించాలని దానికి ఒక ప్రత్యేకమైన కలర్‌ను కలుపుతారు.
తరువాత తెల్లసొనలో పచ్చసొనను ఉంచి దాన్ని కాల్షియం క్లోరైడ్ లేదా కాల్షియం కార్బొనేట్‌తో తయారు చేసిన గుడ్డు లాంటి తెల్లని షెల్‌లో అచ్చులా పోస్తారు. అప్పుడది కోడిగుడ్డులా తయారవుతుంది. ప్రస్తుతం చైనాలోనే కాదు, మన దేశంలోనూ అక్కడక్కడ ఇలాంటి నకిలీ కోడిగుడ్లను తయారు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండడం బెటర్. కింద ఇచ్చిన సూచనలను పాటిస్తే నకిలీ, అసలు కోడిగుడ్లను సులభంగా గుర్తించవచ్చు…
అసలు కోడిగుడ్డు కన్నా నకిలీ కోడిగుడ్డు పై పొర (షెల్) బాగా ప్రకాశవంతంగా, షైనీగా కనిపిస్తుంది. అసలు కోడిగుడ్డుకు షైన్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అసలైన గుడ్డు కన్నా నకిలీ కోడిగుడ్డును పైన టచ్ చేస్తే అది కొంత రఫ్‌గా అనిపిస్తుంది. కోడిగుడ్డును ఊపి చూడాలి. దాన్నుంచి ఏవైనా సౌండ్స్ వస్తే దాన్ని నకిలీగా అనుమానించాలి. ఎందుకంటే నకిలీ గుడ్డు అయితే దాంట్లోని కెమికల్ ద్రవాలు సులభంగా కరిగిపోతాయి కాబట్టి. నకిలీ గుడ్లకు అసలు నీచు వాసన ఉండదు. అసలు కోడిగుడ్లకు ఎంత లేదన్నా కొద్దిగా నీచు వాసన వస్తుంది.
గుడ్డును చిన్నగా టక్ టక్ మని కొట్టి చూడాలి. అసలు కోడిగుడ్డు అయితే టక్ టక్ మని బాగా వినిపిస్తుంది. నకిలీ కోడిగుడ్డును పగల గొట్టగానే అందులోని ద్రవాలు మన ప్రమేయం లేకుండానే సులభంగా కలిసిపోతాయి. నకిలీ గుడ్డును పగలకొట్టి ఫ్రై చేస్తే అందులో ఉండే పదార్థాలు పెనంపై సులభంగా విస్తరిస్తాయి. అసలు కోడిగుడ్డయితే సొనలను విస్తరించడానికి మనం కష్టపడాల్సి ఉంటుంది. నకిలీ గుడ్లలో పచ్చని సొన కొన్ని సార్లు మధ్యలో తెల్లగా కనిపిస్తుంది.