దుస్తుల మీద లిప్‌స్టిక్ మరకలు పడితే వాటిని పోగొట్టడానికి వేజలిన్ రాసి కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత మామూలుగా సబ్బుతో ఉతకాలి. టీ తయారు చేసే పాత్రలకు కొద్దిరోజులకు గార పట్టేస్తుంది. అలాంటప్పుడు వాటిలో గార మునిగేటట్లు నీటిని పోసి అందులో రెండు టీ స్పూన్ల సోడియం బై కార్బనేట్ వేసి మరిగించి కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత మామూలుగా డిటర్జెంట్‌తో శుభ్రం చేయాలి. కప్పుల మీద టీ, కాఫీ మరకలు పట్టేసినా కూడా ఇదే పద్థతి. మరిగించిన సోడియం బై కార్బనేట్ నీటిలో వేసి తర్వాత కడగాలి. వంట త్వరగా పూర్తవడానికి కూరగాయలను చిన్న ముక్కలుగా తరుగుతుంటాం. ఇలాంటప్పుడు వాటిలోని విటమిన్లు ఆవిరై పోతుంటాయి. అందుకే పెద్ద ముక్కలు తరగాలి.
సమయాన్ని ఆదా చేయడం కోసం కూరగాయలను వంట మొదలుపెట్టడానికి గంట రెండు గంటల ముందుగా తరగడం మంచిదికాదు. తరిగిన తర్వాత వీలయినంత త్వరగా వండినట్లయితే పోషకాలు వృథా కాకుండా ఉంటాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్లలో తరిగిన కూరగాయల ముక్కలు దొరుకుతున్నాయి. వంటకు ఎక్కువ టైం కేటాయించడానికి వీలులేని వాళ్లు వీటిపై ఆధారపడడం సహజమే కాని, ముక్కలు చేసిన తర్వాత వండడానికి కనీసం పది గంటల సమయం పడుతుంది. ఇందులోని పోషకాల శాతం ఏ మేరకు ఉంటాయనేది సందేహమే. ముక్కలు తరిగిన తర్వాత కడిగే అలవాటుంటే మాత్రం వెంటనే మానుకోవాలి. ఇలా చేయడం వల్ల విటమిన్లను నష్టపోతాం.
పచ్చిమిరపకాయల్ని ఎక్కువగా తరిగినప్పుడు చేతివేళ్ల మంటతగ్గాలంటే చల్లని పాలలో కొద్దిసేపు ఉంచాలి. పూరీలను, పకోడీలను వేయించేటప్పుడు నూనెలో అర టీ స్పూను ఉప్పు వేస్తే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. చిక్కుళ్లు, పచ్చి బఠాణీలు, ఆకుకూరలు ఉడకబెట్టేటప్పుడు ఒక టీ స్పూను పంచదార కలిపితే సహజమైన రంగుని కోల్పోవు. యాపిల్ తొక్కలను కొద్దిసేపు పాన్‌లో వేసి ఉడకబెడితే అల్యూమినియం పాన్‌లు కొత్తగా మెరుస్తాయి. కోడిగుడ్లను ఉడకబెట్టేటప్పుడు ఆ నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కలిపితే గుడ్డు కొద్దిగా పగిలినా వాటి లోపల ఉండే పదార్ధం బయటికి రాదు. కాలీఫ్లవర్ ఉడికిన తరువాత కూడా తెల్లగా ఉండాలంటే, ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్ళలో రెండు టీ స్పూన్ల పాలు కలపాలి.