2016 వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం మన భారత దేశం లో సుమారు 3 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లెక్క గణనీయంగా పెరిగి ఉండొచ్చు. వీధి జంతువులకి సరైన ఆహారం అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. మారే జీవన శైలి ప్రకారం ఒకప్పుడుతో పోలిస్తే నేడు చాలా మంది జంతువులను పెంచుకుంటున్నారు. అయితే ఇప్పడు విపరీతంగా వీధి కుక్కలు మన దేశంలో ఉన్నాయి. వాటికి మీరు తిండి పెడితే ఈ సమాచారం మీకోసం. ఒక స్థలాన్ని ఎంచుకొని అక్కడే వాటికి ప్రతి రోజు ఆహారం పెట్టండి. ఒక వేళ మీరు వేరే జంతువులని పెంచుకుంటున్నట్టయితే ఆ స్థలం మీ ఇంటికి కొంచెం దూరంగా ఉండేట్టు చూసుకోండి. లేకపోతే మీ ఇంటికి దగ్గర్లో ఉండే స్థలాన్ని ఎంచుకోండి.
వాటితో మంచిగా మెలగండి , వాటికీ వాక్సిన్ వేయించడం మరవకండి. ఉడకపెట్టిన తిండి పదార్థాలు పెట్టడానికి ప్రయత్నించండి. ఎక్కువ కారం మరియు నూనెలో వేయించిన తిండి పదార్థాలను పెట్టకండి. వీధి జంతువులకి తిండి పెట్టడానికి పలు స్వచ్చంద సంస్థలు ఉన్నాయి. వాటి బాగోగులు చూసుకోడానికి జంతు సంరక్షక సంస్థలు ముందుకు వస్తాయి. ఏవి పడితే అవి పెట్టకండి. మనం పెట్టే ఆహరం వల్ల వాటికి రోగాలు రావచ్చు. జంతువులకి ఆహారం పెట్టే ముందు, ఆ ఆహారం వాటికి తగినదా కాదా తెలుసుకోవాలి. జంతువులు గుంపులుగా ఉన్నప్పుడు వాటికీ ఆహారం పెట్టకండి. ఆహారం కోసం ఘర్షణకు పాల్పడి గాయాల పాలవుతాయి. వీలైనంత వరకు జంతువులు గుంపుగా ఉన్నప్పుడు ఆహారం పెట్టకపోడం ఉత్తమం.
ఆహారం పెట్టిన తరువాత తాగు నీరు అందించండి. ఆహారం పెట్టిన వేళనే కాకుండా మామూలు సమయాలలో కూడా తాగు నీరు అందించడానికి ప్రయత్నించండి. జనసంఖ్య ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో, చిన్న పిల్లలు ఆడుకొనే స్థలాలలో ఆహారం పెట్టడం అలవాటు చేయకండి. అమితంగా, తక్కువగా వాటికి తిండి పెట్టకండి. తగినంత మోతాదులో తిండి పెట్టండి. పాలు పోసే సమయంలో జాగ్రత్తగా ఉండండి. జంతువులకి పాల వల్ల వామిటింగ్స్, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు సంభవించొచ్చు. కనుక పాలు తాపే సమయంలో జాగ్రత్త వహించండి. ఈ 10 జాగ్రత్తలు పాటిస్తూ వీధి జంతువులకి ఆహారం తినిపిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇవే కాకుండా జంతువులు అనారోగ్యాంగా ఉన్నప్పుడు జంతు వైద్య డాక్టర్ని సంప్రదించి వాటికి చికిత్స చేయించండి. వీధి జంతువులు అనగా చాల వరకు కుక్కలు, పిల్లులే ఉంటాయి. కనుక ఒకే సారి ఆ రెండింటికి తిండి తినిపించకండి.