Gold : బంగారం అంటే అందరికీ ఇష్టమే. ఈ మధ్య కాలంలో స్త్రీలే కాదు, పురుషులు కూడా బంగారు ఆభరణాలను ధరించేందుకు అమితంగా ఇష్టపడుతున్నారు. కేజీల కొద్దీ బంగారాన్ని కొందరు పురుషులు ఒంటి నిండా ధరిస్తున్నారు. అయితే బంగారం విషయానికి వస్తే ధర రోజూ ఒకేలా ఉండదు. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకునే మార్పులు, విదేశాల్లో జరిగే సంఘటనలు, ఉండే పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. కనుక బంగారం ధర ఏరోజుకారోజు మారుతుంది.
అయితే మన దగ్గర కన్నా విదేశాల్లో బంగారం చాలా తక్కువగా ఉంటుందని అనుకుంటారు. దుబాయ్‌లో వాస్తవంగా చెప్పాలంటే మన దగ్గర కన్నా బంగారం చాలా తక్కువ ధరకే ఉంటుంది. అక్కడి ఎయిర్‌పోర్టుల్లో చాలా బంగారం దుకాణాలు ఉంటాయట. అందువల్ల చాలా మంది ప్రయాణికులు సైతం ఎయిర్‌పోర్టుల్లోనే బంగారం కొంటుంటారట. అయితే అలా విదేశాలలో బంగారాన్ని కొన్నప్పుడు మనం ఇండియాకు దాన్ని తీసుకువస్తే దానిపై ఎంత వరకు పరిమితి ఉంటుంది.. ఎంత వరకు ఉచితంగా బంగారాన్ని ట్యాక్స్ కట్టకుండా తేవచ్చు.. ఎంత బంగారం పరిమాణం దాటితే పన్ను కట్టాల్సి వస్తుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంత వరకు ఉచితమే..
విదేశాల నుంచి బంగారం తెచ్చుకునేప్పుడు మూడు రకాలుగా పన్ను ఉంటుంది. బంగారు ఆభరణాలు అయితే 20 గ్రాముల వరకు ఉచితంగా తెచ్చుకోవచ్చు. వాటి విలువ రూ.50వేల లోపు ఉండాలి.అది కూడా ఒక ఏడాదిలో మాత్రమే ఇంత పరిమాణంలో బంగారాన్ని ఇండియాకు తెచ్చుకునేందుకు అనుమతిస్తారు. ఈ నియమాల కన్నా ఎక్కువ మొత్తంలో బంగారం తెస్తే మాత్రం పన్ను కట్టాల్సి ఉంటుంది.
ఇక విదేశాల నుంచి బంగారాన్ని బార్స్, కాయిన్స్ రూపంలోనూ తెచ్చుకోవచ్చు. విదేశాల నుంచి బంగారాన్ని బార్స్ రూపంలో తెస్తే 20 గ్రాముల కన్నా తక్కువ పరిమాణంలో బంగారం ఉంటే అప్పుడు 10 శాతం కస్టమ్స్ పన్ను చెల్లించాలి. బంగారం బార్స్ పరిమాణం 20 గ్రాముల నుంచి 100 గ్రాముల మధ్యలో ఉంటే 3 శాతం పన్ను విధిస్తారు. బంగారం బార్స్ పరిమాణం 100 గ్రాముల కన్నా ఎక్కువగా 1 కిలో కన్నా తక్కువగా ఉంటే అప్పుడు 10 శాతం కస్టమ్స్ పన్ను విధిస్తారు.
కాయిన్స్ అయితే..
బంగారు కాయిన్స్ అయితే 20 గ్రాముల లోపు బరువు ఉంటే 10 శాతం పన్ను కట్టాలి. బంగారు కాయిన్స్ బరువు 20 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఉన్నా కూడా 10 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎవరైనా సరే విదేశాల నుంచి బంగారాన్ని తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఇక విదేశాల్లో మీరు బంగారం కొంటే దాన్ని ఇండియాకు తెస్తే కచ్చితంగా రశీదు ఉండాలి. లేదంటే స్మగ్లింగ్ కింద మిమ్మల్ని అరెస్టు చేసే చాన్స్ ఉంటుంది. కనుక విదేశాలలో బంగారం కొని ఇండియాకు తెచ్చేవారు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.