ప్రతి ఏడాది అందరూ స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంటారు. అందరూ వాడ వాడలా ఉదయాన్నే జాతీయ జెండాలను ఎగురవేస్తారు. అంతటితో ఆగుతారా.. జాతీయ జెండాను ఎగురవేస్తున్నప్పుడు, దానికి వందనం చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ సైట్లలో షేర్ చేస్తారు. జాతీయ జెండాను పోలిన దుస్తులను ధరించి సంబుర పడతారు. ఇంత వరకు బాగానే ఉంది, కానీ ఇంకో పని కూడా చేస్తారు, అదేంటో తెలుసా..? సోషల్ సైట్లలో సొంత ఫొటో తీసేసి జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటారు..! అవును, చాలా మంది అలా చేస్తారు కదా, అందులో తప్పేముందీ, అని అడగబోతున్నారా..? అయితే మీరు అంటున్నది కరెక్టే. కానీ.. కొన్ని షరతులు వర్తిస్తాయి. అవేమిటంటే…
ఈ మధ్య కాలంలో సోషల్ సైట్లలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. అదేమిటో చాలా మందికి తెలుసు. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సైట్లలో యూజర్లు ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టుకోవచ్చా, లేదా, పెట్టుకుంటే ఏమవుతుంది..? అని ఓ వార్త ప్రధానంగా వైరల్ అవుతోంది. అయితే దీనికి కొందరు ఏమని సమాధానం చెబుతున్నారంటే… జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటే నేరం చేసినట్టు అవుతుందని, The Prevention of Insults to National Honour Act, 1971 ప్రకారం, FLAG CODE OF INDIA, 2002 ప్రకారం శిక్షార్హులవుతారని అంటున్నారు. దీంతో చాలా మంది యూజర్లు జెండా వందనం చేసేటప్పుడు ప్రొఫైల్ పిక్‌ను మారుద్దామా, వద్దా అనే ఆలోచనలో ఉండగా, కొందరు మాత్రం ఇదేమీ పట్టించుకోవడం లేదు. అయితే నిజానికి అలా భయపడాల్సిన పనిలేదు. సోషల్ సైట్లలో ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండా ఫొటోను పెట్టుకోవచ్చు. కాకపోతే కొన్ని షరతులు ఉంటాయి.
పైన చెప్పిన The Prevention of Insults to National Honour Act 1971, FLAG CODE OF INDIA 2002 చట్టాలతోపాటు Prevention of Insults to National Honour (Amendment) Act 2005 ప్రకారం దేశ జాతీయ జెండా, జాతీయ చిహ్నం, జాతీయ గీతాలను ఉద్దేశపూర్వకంగా కానీ, మరే విధంగా కానీ అవమానించినట్లు ప్రవర్తిస్తే అప్పుడు ఈ చట్టాల ప్రకారం శిక్షార్హులవుతారు. అదేవిధంగా జాతీయ జెండాను తగలబెట్టడం, నిర్దేశిత సమయంలో కాకుండా వేరే సమయంలో ఎగరేయడం, అవనతం చేయడం, నాశనం చేయడం, చింపేయడం, జెండాను అమర్యాద గా చూడటం, వస్త్రాలుగా కుట్టించుకోవడం, లో దుస్తులుగా వాడటం, కర్చీఫ్‌గా వాడటం, నాప్కిన్, కుషన్స్ గా వాడటం, జాతీయ జెండాను నేలకు తాకించడం, కావాలని నీళ్లలో తడపడం, జాతీయ జెండాను వెహికిల్, ట్రెయిన్, బస్సు, బోటు లాంటి వాటి చుట్టూ అలంకరించడం, జెండాను బిల్డింగ్ చుట్టూ కట్టడం లాంటివి చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. లేదా శిక్ష, ఫైన్ రెండూ వేస్తారు.
అయితే ఈ చట్టాల్లో ఎక్కడా ఫేస్‌బుక్ లాంటి సోషల్ సైట్ల గురించిన ప్రస్తావన లేదు. వాటిల్లో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాలా వద్దా అనే విషయంపై వివరణ ఇవ్వలేదు. కాబట్టి దీన్నిఅనుసరించి కొందరు నిపుణులు చెబుతున్నది ఏమిటంటే.. జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా సోషల్ సైట్లలో పెట్టుకోవచ్చు. కాకపోతే అవమాన పరిచే రీతిలో ఆ ఫొటో ఉండకూడదు. రివర్స్ గా జెండాను పెట్టుకోవడం, కలర్స్ మార్చడం, జెండాను ఎడిట్ చేయడం, జెండా ను వంకరగా పెట్టుకోవడం లాంటివి చేయకుండా ఉన్న జెండాను ఉన్నట్టే ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుంటే ఎటువంటి సమస్యా ఉండదు. కనుక జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోండి, కానీ జెండాను అవమానపరిచే రీతిలో మాత్రం ఫొటో పెట్టకండి.