inspiration

ప్ర‌పంచంలోని అత్యంత ధ‌నికుల్లో ఒక‌రైన వారెన్ బ‌ఫెట్ ఇండియాలో పెట్టుబ‌డులు ఎందుకు పెట్ట‌లేదో తెలుసా..?

ప్ర‌పంచంలోని అత్యంత ధ‌న‌వంతులైన జాబితాలో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త వారెన్ బ‌ఫెట్ టాప్ స్థానంలో ఉంటారు. కొన్ని ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఆస్తి ఈయ‌న సొంతం. ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ ప్ర‌క‌టించిన ప్ర‌పంచంలోని టాప్ బిలియ‌నీర్ల జాబితాలో ఈయన టాప్‌ స్థానంలో ఉంటారు. వారెన్ బ‌ఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ ఆస్తి విలువే సుమారుగా రూ.7.75 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. ఈ మొత్తం మ‌న దేశంలోని బ్యాంకులన్నింటి వ‌ద్ద ఉన్న మొత్తం నిర‌ర్థ‌క ఆస్తుల విలువ రూ. 9ల‌క్ష‌ల కోట్ల క‌న్నా కొంత త‌క్కువ‌.. అంతే..! కేవ‌లం ఈ ఒక్క కంపెనీ ఆస్తుల‌తోనే మ‌న దేశానికి చెందిన టీసీఎస్ కంపెనీ ఆస్తుల‌ను ఈయ‌న కొన‌గ‌ల‌రు. టీసీఎస్ ప్ర‌స్తుత మార్కెట్ విలువ రూ.6.7 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా ఉంది.

ఇక బెర్క్‌షైర్ హాతవే ప్ర‌క‌టించిన‌ పోర్ట్‌ఫోలియో ప్రకారం వారెన్ బఫెట్‌కు అమెరికన్ ఎయిర్ లైన్స్‌లో 10 శాతం వాటా ఉంది. అలాగే యాపిల్‌లో 4.75 శాతం, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లో 17.5 శాతం షేర్లు కూడా ఉన్నాయి. అయితే పెట్టుబ‌డులు పెట్ట‌డంలో చ‌క్క‌ని వ్యూహంతో ముందుకు వెళ్లే వారెన్ బ‌ఫెట్ మాత్రం అభివృద్ధి చెందుతున్న భారత్, చైనా లాంటి దేశాలలో మాత్రం పెట్టుబడులు పెట్టడం లేదు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఆయ‌న ఈ నిర్ణయం తీసుకోవ‌డం వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటో తెలుసా..?

why warren buffet did not invested in any company in india

వారెన్ బఫెట్ 1930, ఆగస్టు 30న నెబ్రెస్కాలోని ఒమాహా నగరంలో జన్మించారు. ఆయనకు ఆపిల్‌లో షేర్లు ఉన్నా, ఆయన వద్ద మాత్రం ఆపిల్ ఫోన్ ఉండ‌దు. ఆయన ఐఫోన్ కాదు కదా, కనీసం స్మార్ట్ ఫోన్లు కూడా వాడరు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఇంకా పాత ఫ్లిప్ ఫోన్‌లనే ఆయ‌న వాడతారు. 2013లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏమ‌న్నారంటే.. తాను 20-25 ఏళ్లు వాడిన తర్వాత కానీ ఏ వ‌స్తువునూ పారేయను.. అని అన్నారు. 87 ఏళ్ల వారెన్ బఫెట్ మొట్టమొదటిసారిగా 11 ఏళ్ల వయసులో షేర్లు కొన్నారు. ఆ తర్వాత రెండేళ్లకు మొదటిసారి పన్ను చెల్లించారు. ప్రైవేట్ జెట్ ఉన్నా పాతకారులోనే ప్రయాణం చేస్తుంటారు. ఒకప్పుడు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఆయనకు సీటు ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఆ తర్వాత కొలంబియా యూనివర్సిటీ ఆయనను మాస్టర్స్ డిగ్రీతో సత్కరించింది.

ఫోర్బ్స్ పత్రిక ప్రకారం బఫెట్ తన మొదటి 3-బెడ్ రూం అపార్ట్‌మెంట్‌ను 1958లో కొనుగోలు చేశారు. ఇప్పటికీ ఆయన అందులోనే నివసిస్తున్నారు. 2014 వరకు బఫెట్ ఎనిమిదేళ్ల క్రితం కొన్న పాత కారులోనే ప్రయాణించేవారు. ఆ తర్వాత జనరల్ మోటార్స్ సీఈఓ ఎలాగోలా అప్‌గ్రేడెడ్ కార్ తీసుకునేలా ఆయనను ఒప్పించారు. బఫెట్‌కు సొంత ప్రైవేట్ జెట్ ఉంది. దానిని వ్యాపార అవసరాల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. తన జీవితంలో ఆయన ఎంతో సంపాదించినా, ఖర్చు చేయడం అంటే మాత్రం ఆయనకు ఇష్టం లేదు. తన ఆదాయంలో 99 శాతాన్ని ఆయన విరాళాలుగా ఇస్తున్నారు. ఆయన పేరుతో ట్రస్ట్ లేకున్నా ఆయన బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలు ఇస్తున్నారు.

ఇక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో (భార‌త్‌, చైనాల‌లో) బఫెట్ ఎందుకు పెట్టుబడి పెట్టరు అన్న విష‌యానికి వ‌స్తే.. అందుకు ప‌లు కార‌ణాలు ఉన్నాయి. అవేమిటంటే… రిస్క్ ఉన్న చోట పెట్టుబడులు పెట్టడానికి వారెన్ బఫెట్ దూరం. ఆయన ఎప్పుడూ దీర్ఘకాలిక పెట్టుబడులనే పెడతారు. అయితే భారత్‌ లాంటి దేశాలలో పెట్టుబడి పెట్టడానికి ఆయనేమీ వ్యతిరేకం కాదు. ఆయన హోల్డింగ్ కంపెనీ బెర్క్‌షైర్ హాతవే 2010-11లోనే భారత్‌లోని బీమా రంగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. భారతదేశం ఆనాడు బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించింది. అయితే రెండేళ్లు ప్రయత్నించిన తర్వాత వారెన్ బఫెట్ తన ప్రయత్నాలను విరమించుకున్నారు. భారత్‌లోని రెడ్ టేపిజం ఒక సమస్య కాగా, అమెరికా, జపాన్ లాంటి ఆర్థిక వ్యవస్థలతో లావాదేవీలు నిర్వహించిన బఫెట్‌కు భారతదేశంలో ఉండే పేపర్ వర్క్‌ చాలా కష్టంగా అనిపించింది.

భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుండవచ్చు కానీ, విధానాలు, నిర్వహణా వ్యవస్థ విషయానికి వస్తే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇక్కడ ప్రతి అంశం రాజకీయ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకువస్తే, ఎన్నికల్లో మరో పార్టీ దాన్ని తోసిపుచ్చుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారెన్ బఫెట్ లాంటి ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనడం చాలా కష్టం. అందుకే వారెన్ బ‌ఫెట్ మ‌న దేశంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి విముఖత ప్ర‌ద‌ర్శించారు. అలాగే వారెన్ బఫెట్ వ్యూహాలు చాలా భిన్నమైనవని ప‌లువురు మార్కెట్ విశ్లేష‌కులు అంటారు. ఆయన పెట్టుబడులను ఎక్కువగా సమర్థమైన మేనేజ్‌మెంట్ కలిగిన కంపెనీలలో పెడతారట‌. అంతే కాకుండా ఆయన పెట్టుబడి పెట్టే కంపెనీల వాల్యుయేషన్ కూడా బాగుండాలట‌.

వారెన్ బఫెట్‌కు భారత, చైనాల ఆర్థిక వ్యవస్థ గురించి అంచనా లేదని కాదు. కానీ ప్రత్యక్షంగా భారత్, చైనాలలో పెట్టుబడి పెట్టే బదులు అదే రంగంలో ఉన్న దిగ్గజ కంపెనీలలో ఆయన పెట్టుబడి పెడతారు. అందుకే ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్, గ్యాస్ కంపెనీ ఎక్సన్‌లో పెట్టుబడులు పెట్టారు. ఎక్సనే భారతదేశంలోని రిలయెన్స్ లాంటి కంపెనీలలో భాగస్వామి అవుతున్నపుడు ఇక వేరేగా భారతదేశంలో ఎందుకు పెట్టాలి?.. అని వారెన్ బ‌ఫెట్ ఉద్దేశం. అంటే.. ఆయ‌న నేరుగా పెట్టుబ‌డులు పెట్టుకుండా అలాంటి పేరుగాంచిన కంపెనీల్లో పెట్టుబ‌డులు పెడ‌తార‌న్న‌మాట‌. దీంతో ఎక్కువ‌గా రిస్క్ ఉండ‌దు. పైగా పెద్ద స‌మ‌స్య‌లు ఎదురు కావ‌ని బ‌ఫెట్ న‌మ్మ‌కం.

ఇక మ‌న దేశంలో బ‌ఫెట్ పెట్టుబ‌డులు పెట్ట‌క‌పోవ‌డానికి మ‌రో కార‌ణం.. ఎక్స్‌చేంజ్ రేటు. అది దేశంలోని ఆర్థిక వ్యవస్థ మీద, రాజకీయాల మీద ఆధారపడి ఉంటుంది. కార్పొరేట్ గవర్నెన్స్, కంపెనీల పారదర్శకత కూడా మరో కారణం. భారత్ చైనాలలో అవి అంత బాగా లేవు. కింగ్ ఫిషర్, జేపీ గ్రూప్‌లనే తీసుకుంటే అవి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకుని మునిగిపోయాయి.. భారతదేశంలో పెట్టుబడులకు బఫెట్ దూరంగా ఉండడానికి ఇక్కడ రెగ్యులేషన్లలో పారదర్శకత లేకపోవడం కూడా ఒక కారణమని ప‌లువురు ఆర్థిక వేత్త‌లు అంటారు. ఏది ఏమైనా.. బ‌ఫెట్ లాంటి గొప్ప వ్యాపార‌వేత్త‌నే కాదు, సామాజిక స్పృహ ఉన్న వ్య‌క్తిని కూడా మ‌నం చూసి ఉండం. ఎందుకంటే ఆయన త‌న సంపాద‌న‌లో 99 శాతం విరాళంగానే ఇస్తుంటారు క‌నుక‌..!

Admin

Recent Posts