Banana In Pregnancy : గర్భిణీ స్త్రీలు వారు తీసుకునే ఆహారంలో ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారు ఎక్కువగా పండ్లు, కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది. సహజంగా దొరికే పండ్లను, కూరగాయలను తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు ఎదుగుదల చక్కగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు తీసుకోదగిన పండ్లల్లో అరటి పండు ఒకటి. చాలా మంది స్త్రీలు గర్భధారణ సమయంలో అరటి పండును తీసుకోవాలా వద్దా అని సందేహిస్తూ ఉంటారు. అరటి పండులో విటమిన్స్, మినరల్స్ తోపాటు శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు కూడా ఉంటాయి. గర్భస్థ శిశుకు నాడీ మండల వ్యవస్థ ఏర్పడడంలో ఫోలిక్ యాసిడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
అరటి పండులో అధికంగా ఉండే పోషకాల్లో ఫోలిక్ యాసిడ్ కూడా ఒకటి. అరటి పండును తీసుకోవడం వల్ల తగినంత ఫోలిక్ యాసిడ్ లభ్యమవుతుంది. అంతేకాకుండా అరటి పండును తీసుకోవడం వల్ల నెలలు నిండకుండా ప్రసవం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే చాలా మంది గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే సమస్యల్లో రక్తహీనత సమస్య కూడా ఒకటి. అరటి పండును తీసుకోవడం వల్ల దీనిలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. అదే విధంగా గర్భిణీ స్త్రీలలో మనం మలబద్దకం సమస్యను కూడా అధికంగా చూడవచ్చు. ఈ సమస్యను తగ్గించడంలో అరటి పండు మనకు ఉపయోగపడుతుంది.
అరటి పండులో అధికంగా ఉండే ఫైబర్ ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేలా చేసి మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలు అరటి పండును తీసుకోవడం వల్ల తగినంత కాల్షియం లభించి గర్భస్థ శివువు ఎముకల నిర్మాణం చక్కగా ఉంటుంది. అరటి పండులో అధికంగా ఉండే విటమిన్ బి6 ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఏర్పడడంలో సహాయపడుతుంది. అలాగే గర్భస్థ శిశువుతోపాటు గర్భిణీ స్త్రీలలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో అరటి పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎంతగానో దోహదపడుతాయి. గర్భం ధరించిన తరువాత మొదటి నెల వాంతులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో స్త్రీలు ఉదయం పూట అరటి పండును తినడం వల్ల వాంతులు, వికారం, నీరసం తగ్గుతాయి.
గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే మరో అనారోగ్య సమస్య రక్తపోటు. అరటి పండులో అధికంగా ఉండే పొటాషియం గర్భిణీ స్త్రీలలో రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. నీరసంగా ఉన్నప్పుడు అరటి పండును తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండును తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో వచ్చే మానసిక సమస్యలు, ఒత్తిడి, ఆందోళన తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక గర్భిణీ స్త్రీలు నిరభ్యంతరంగా అరటి పండును వారి ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రం దీనిని తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొందరిలో అరటి పండు ఎలర్జీలను కూడా కలిగిస్తుంది. కనుక అలాంటి వారు అరటి పండుకు దూరంగా ఉండడమే మంచిది. కేవలం గర్భధారణ సమయంలోనే కాకుండా ప్రసావానంతరం కూడా అరటి పండును తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.