Aloo Masala Puri : పూరీలు అంటే సహజంగానే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఆలు కర్రీ లేదా చికెన్, మటన్ వంటి వాటితో పూరీలను తింటారు. ఇలా తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అయితే పూరీలను ఎన్నో రకాలుగా తయారు చేయవచ్చు. వాటిల్లో ఆలూ మసాలా పూరీ ఒకటి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ మసాలా పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆలుగడ్డ – ఒకటి (ఉడికించి ముద్దలా చేయాలి), గోధుమ పిండి – ఒక కప్పు, ఇంగువ, ధనియాల పొడి, పసుపు, కారం, ఆవాలు – ఒక్కొక్కటి పావు టీస్పూన్ చొప్పున, నూనె, ఉప్పు – తగినంత.
ఆలూ మసాలా పూరీలను తయారు చేసే విధానం..
గోధుమ పిండిలో ఆలుగడ్డ ముద్ద, ఇంగువ, ధనియాల పొడి, పసుపు, కారం, ఆవాలు, ఉప్పు వేసి బాగా కలిపి నీళ్లతో పూరీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని పూరీలుగా ఒత్తుకుని నూనెలో వేయించుకుంటే ఆలూ మసాలా పూరీలు సిద్ధమవుతాయి. కారం, ఉప్పు వేస్తారు కనుక వీటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఇతర ఏ కూరతోనైనా సరే కలిపి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.