Paralysis Symptoms : పక్షవాతం అనేది సాధారణంగా 65 ఏళ్లు పైబడిన వారికి వస్తుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా తక్కువ వయస్సున్న వారికి కూడా పక్షవాతం వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మధుమేహం, స్థూలకాయం, హై కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, హై బీపీ వంటి అనేక అనారోగ్యాల వల్ల ప్రస్తుతం చాలామందికి పక్షవాతం వస్తోంది. అయితే.. పక్షవాతం వచ్చాక బాధ పడడం కంటే అది రాకముందే అప్రమత్తంగా ఉండాలి. ఈ క్రమంలోనే పక్షవాతం వచ్చే ముందు మన శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా గుర్తిస్తే.. ముందుగానే ఆ ప్రమాదం నుంచి బయట పడవచ్చు. మరి పక్షవాతం వచ్చే ముందు మనలో కనిపించే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
పక్షవాతం వచ్చే ముందు ముఖానికి ఒక వైపు స్పర్శ సరిగ్గా ఉండదు. ఒక వైపును సరిగ్గా కదిలించలేరు. అలాగే ఒక వైపు ఉండే ముఖంపై చర్మం అంతా సాగినట్లు అవుతుంది. ముఖాన్ని రెండు వైపులా సరిగ్గా కదిలిస్తే.. పక్షవాతం వచ్చేది.. రానిదీ తెలుసుకోవచ్చు.. ఒక వైపు ముఖాన్ని కదిలించకపోతే.. వెంటనే అప్రమత్తం అవ్వాలి. తక్షణమే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. కొందరికి అప్పుడప్పుడు శరీరంలో కేవలం ఒకే వైపు స్పర్శ లేకుండా అవుతుంది. ఆ సమయంలో కొందరు శరీరంలో ఒక పక్క భాగాన్ని (చేతులు, కాళ్లు కూడా) కదిలించలేకపోతారు. ఇలా గనక ఎవరికైనా అనిపిస్తుంటే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి.
పక్షవాతం వచ్చే ముందు కొందరికి మాట కూడా సరిగ్గా రాదు. అస్పష్టంగా మాట్లాడుతుంటారు. ఇలా గనక జరుగుతుంటే.. వెంటనే స్పందించి.. డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. పక్షవాతం వచ్చే ముందు కొందరు చేతులను, కాళ్లను పైకి ఎత్తలేకపోతుంటారు. ఇలా జరిగితే పక్షవాతంగా అనుమానించి వెంటనే చికిత్స తీసుకోవాలి. పక్షవాతం వచ్చే ముందు కొందరు.. ఇతరులతో సంభాషించేటప్పుడు అయోమయానికి లోనవుతుంటారు. ఎదుటి వారు చెప్పే మాటలను వారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. ఎప్పుడూ బాగా తలనొప్పిగా ఉండడం, కళ్లు తిరగడం, నడక తడబడడం, దృష్టి లోపాలు.. తదితర లక్షణాలు ఉంటే.. పక్షవాతంగా అనుమానించి డాక్టర్‌ను కలవాలి.