W Sitting Position : చిన్నారులు ఆడుకుంటున్నప్పుడు లేదా చదువుకుంటున్నప్పుడు నేలపై కూర్చోవడం సహజం. అయితే కుర్చీలో కూర్చుంటే ఏం కాదు. కానీ నేలపై కూర్చున్నప్పుడు మాత్రం ఏ భంగిమలో అంటే ఆ భంగిమలో కూర్చోరాదు. ముఖ్యంగా కింద చూపించిన విధంగా డబ్ల్యూ సిట్టింగ్ భంగిమలో చిన్నారులు కూర్చుంటే అది ప్రమాదం. ఇది అనేక అనర్థాలకు దారి తీస్తుంది. ఎందుకంటే డబ్ల్యూ సిట్టింగ్ భంగిమలో చిన్నారులు కూర్చోవడం వల్ల వారికి భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చిత్రంలో చూపించిన విధంగా డబ్ల్యూ సిట్టింగ్ భంగిమలో కూర్చోవడం వల్ల చిన్నారి నడుం, తొడలు, మోకాళ్లు, మడిమలపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు చేటు చేస్తుంది. నిత్యం మనం చేసే వివిధ రకాల పనుల కోసం అవసరమయ్యే కీలక కండరాల శక్తి డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్ వల్ల నిస్తేజమవుతుంది. ప్రధానంగా పొత్తి కడుపు, వెన్నెముక కండరాలపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్ వల్ల శరీరంలోని పై భాగంలో ఉండే కండరాలు తమ సహజమైన వంగే గుణాన్ని కోల్పోతాయి. దీని వల్ల శరీరం ఒకే పొజిషన్‌కు పరిమితమై ఎల్లప్పుడూ టైట్‌గా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది.
పిల్లలు పెద్ద వారైన తరువాత భవిష్యత్‌లో ఎక్కువ బరువున్న వస్తువులను మోయలేరు. అంతేకాదు శరీరాన్ని, బరువును బ్యాలెన్స్ చేసుకోవడం కష్టతరమవుతుంది. డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్ వల్ల కండరాలు, నడుం, మోకాళ్లు, మడిమలు గట్టిపడి టైట్‌గా ఉండిపోతాయి. ఇది భవిష్యత్తులో కాళ్లు, వెన్ను నొప్పులకు దారి తీస్తుంది. ఇవే కాదు కాళ్లను ఒకదానిపై ఒకటి వేసి కూర్చోవడం (క్రాస్ లెగ్ సిట్టింగ్), ఒక పక్కగా కూర్చోవడం (సైడ్ సిట్టింగ్), ఎక్కువ సేపు కూర్చోవడం.. వంటి వాటి వల్ల కూడా పిల్లల కండరాలు వంగే గుణాన్ని కోల్పోతాయి. దీంతో అవి టైట్ గా మారుతాయి. భవిష్యత్తులో వారికి కండరాల సమస్యలు వస్తాయి. కనుక ఈ భంగిమలో చిన్నారులను అసలు కూర్చోనివ్వకండి. లేదంటే ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి.