Potato Rice : బంగాళాదుంపలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది బంగాళాదుంపలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. వీటితో మనం ఎక్కువగా వేపుడు, పులుసు, కూరలు, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా బంగాళాదుంపలతో మనం ఎంతో రుచిగా ఉండే రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఆలూ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లల్లోకి ఈ రైస్ చాలా చక్కగా ఉంటుంది. ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఆలూ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బియ్యం – అర కిలో, బంగాళాదుంపలు – 3, తరిగిన టమాటాలు – 2, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, పచ్చి బఠాణీ – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, అనాస పువ్వు – 1, యాలకులు – 3, బిర్యానీ ఆకులు – 2, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్.
ఆలూ రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత బంగాళాదుంప ముక్కలు, బఠాణీ వేసి వేయించాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాట ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. తరువాత బియ్యం వేసి కలపాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ చొప్పున నీళ్లను పోసి కలపాలి.
తరువాత దీనిని 15 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని 5 నిమిషాల పాటు కదిలించకుండా అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ రైస్ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆలూ రైస్ ను నేరుగా తిన్నా లేదా రైతాతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఆలూతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా రైస్ ను కూడా తయారు చేసుకుని తినవచ్చు.