Aloo Menthikura Fry : మనం మెంతికూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మెంతి కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. మెంతి కూరతో రకరకాల రుచికరమైన వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. మెంతికూరతో చేసుకోదగిన వంటకాల్లో ఆలూ మేథీ ఫ్రై కూడా ఒకటి. మెంతికూర, బంగాళాదుంపలు వేసి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. మెంతికూరను తినడానికి ఇష్టపడని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, సులభంగా ఆలూ మేథీ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ మేథీ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన బంగాళాదుంపలు – అరకిలో, తరిగిన మెంతి కూర – 2 కట్టలు, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్.
ఆలూ మేథీ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలు వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత మెంతికూర వేసి కలపాలి. దీనిని నీరంతా పోయి దగ్గర పడే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత వేయించిన బంగాళాదుంప ముక్కలను కూడా వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత కారం, గరం మసాలా వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మేథీ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ ఆలూ ఫ్రై కంటే ఈ విధంగా మెంతికూర వేసి చేసిన ఆలూ ఫ్రై మరింత రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.