Pomegranate Juice For Cartilage : మనలో చాలా మంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. వయసు పైబడిన వారిలోనే కాకుండా నడి వయస్కుల్లో, యువతలో కూడా మనం ఈ సమస్యను ఎక్కువగా చూస్తున్నాం. ఆర్థరైటిస్, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల మధ్యలో కీళ్లు అరిగిపోవడం, కార్టిలేజ్ దెబ్బతిని జిగురు ఉత్పత్తి కాకపోవడం వంటి సమస్యలు తలెత్తడానికి మారిన మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి వాటి కారణంగా ఈ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. కీళ్ల మధ్య ఇన్ ప్లామేషన్ రావడం వల్ల కొన్ని రకాల హానికారక రసాయనాలు విడుదల అవుతాయి. ఈ రసాయనాలు కార్టిలేజ్ ను దెబ్బతినేలా చేయడంతో కార్టిలేజ్ పగిలి పోయేలా చేస్తాయి.
దీంతో జిగురు సరిగ్గా ఉత్పత్తి అవ్వక మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుండి బయటపడాలంటే మన ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు దానిమ్మ జ్యూస్ ను కూడా తాగాలని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల కార్టిలేజ్ దెబ్బతినకుండా ఉంటుంది. దీంతో భవిష్యత్తులో ఆర్థరైటిస్ సమస్య బారిన పడకుండా ఉంటాము. ఆర్థ రైటిస్ సమస్య బారిన పడిన వారు కూడా ఈ దానిమ్మ గింజల జ్యూస్ ను తాగడం వల్ల కార్టిలేజ్ మరింత దెబ్బతినకుండా సమస్య మరింత తీవ్రతరం కాకుండా ఉంటుంది. దానిమ్మలో ప్యుని క్యాటజిన్స్ మరియు ప్యూనిక్ యాసిడ్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాటిలేజ్ ను దెబ్బతీసే ఎంజైమ్ లను అరికట్టడంలో అద్భుతంగా పని చేస్తాయి. మ్యాప్ కైనేజెస్, మెటాలో ప్రొటినేజెస్, ఎన్ ఎఫ్ కప్పా బి అనే ఎంజైమ్ లు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల కీళ్ల మధ్య కార్టిలేజ్ ఎక్కువగా దెబ్బ తింటుంది.
ఈ ఎంజైమ్ లు ఎక్కువగా ఉత్పత్తి అవ్వకుండా వాటిని నశింపజేయడంలో దానిమ్మలో ఉండే రసాయనాలు మనకు సహాయపడతాయి. కీళ్ల మధ్య కార్టిలేజ్ ఎంత చక్కగా ఉండే అంత చక్కగా జిగురు ఉత్పత్తి అవుతుంది. జిగురు ఎక్కువగా ఉండడం వల్ల కీళ్ల మధ్య రాపిడి అంత తక్కువగా ఉంటుంది. అలాగే కీళ్లు అరిగిపోకుండా ఉంటాయి. దీంతో మనకు మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఒక్కసారి దెబ్బతిన్న కార్టిలేజ్ ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురాలేము. కనుక కీళ్ల మధ్య కార్టిలేజ్ దెబ్బతినకుండా చూసుకోవడమే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. దానిమ్మ గింజల జ్యూస్ ను తాగడం వల్ల లేదా దానిమ్మ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కార్టిలేజ్ దెబ్బతినకుండా ఉంటుంది. దీంతో కీళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి. దానిమ్మ పండ్లను తీసుకోవడంతో పాటు ఉప్పును తీసుకోవడం కూడా పూర్తిగా తగ్గించాలి.