Ambur Chicken Dum Biryani : చికెన్ బిర్యానీ.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ చికెన్ బిర్యానీని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఆంబూర్ చికెన్ దమ్ బిర్యానీ కూడా ఒకటి. తమిళనాడులో బాగా ఫేమస్ అయిన ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ ఆంబూర్ చికెన్ దమ్ బిర్యానీని వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అందరికి నచ్చేలా ఆంబూర్ చికెన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంబూర్ చికెన్ దమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు.
చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 15, నూనె – 80 ఎమ్ ఎల్, దాల్చిన చెక్క – 4 ముక్కలు, లవంగాలు – 4, బిర్యానీ ఆకు – 1, యాలకులు – 3, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 150 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్స్, చికెన్ – కిలో, తరిగిన టమాటాలు – 3, తరిగిన పచ్చిమిర్చి – 3, ఉప్పు – తగినంత, చిలికిన పెరుగు – అర కప్పు, గరం మసాలా – ఒకటిన్నర టేబుల్ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
గంట పాటు నానబెట్టిన జీలకర్ర బియ్యం – రెండు కప్పులు, నూనె – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆంబూర్ చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీరు, ఎండుమిర్చి వేసి మెత్తగా ఉడికించాలి. ఎండుమిర్చి మెత్తగా ఉడికిన తరువాత వాటిని జార్ లో లేదా రోట్లో వేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత బిర్యానీ గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత చికెన్ వేసి కలపాలి. దీనిని 3 నిమిషాలకొకసారి కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, పచ్చిమిర్చి, పెరుగు, ఉప్పు, గరం మసాలా, నీళ్లు పోసి కలపాలి.
ఇప్పుడు దీనిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై 90 శాతం ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత చికెన్ గ్రేవీని ఒక కప్పు మోతాదులో తీసి పక్కకు ఉంచాలి. తరువాత ఇందులో నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు, నూనె వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి కలపాలి. బియ్యాన్ని 80 శాతం ఉడికించిన తరువాత వడకట్టి ముందుగా ఉడికించిన చికెన్ పై వేసుకోవాలి. దీనిని గంటెతో అక్కడక్కడ కలుపుకోవాలి. తరువాత పక్కకు ఉంచిన చికెన్ గ్రేవీని అన్నంపై వేసుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచాలి. ఇప్పుడు అన్నాన్ని వడకట్టగా మిగిలిన నీళ్లు ఉన్న గిన్నెను అలాగే బిర్యానీ గిన్నె మూతపై ఉంచాలి.
ఇప్పుడు ఈ బిర్యానీని 20 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి నెయ్యి, కొత్తిమీర చల్లుకోవాలి. తరువాత గంటెతో అక్కడక్కడ బిర్యానీని కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి మరో 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆంబూర్ చికెన్ దమ్ బిర్యానీ తయారవుతుంది. దీనిని చికెన్ షేర్వా, రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ బిర్యానీ మరీ అంత పొడి పొడిగా ఉండదు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో తరచూ చేసే బిర్యానీతో పాటు అప్పుడప్పుడూ ఇలా స్పెషల్ బిర్యానీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.