food

Aratikaya Bajji : అర‌టికాయ బ‌జ్జీల‌ను ఇలా చేసి సాయంత్రం స‌మ‌యంలో వేడిగా తినండి..!

Aratikaya Bajji : సాయంత్రం అయిందంటే చాలు చాలా మంది ఏం స్నాక్స్ తిందామా అని ఆలోచిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ఎవ‌రి అభిరుచికి త‌గిన‌ట్లు వారు సాయంత్రం చిరుతిండిని లాగించేస్తుంటారు. అయితే బ‌య‌టి తిండి ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. క‌నుక ఇంట్లోనే వీటిని వండుకుని తింటే బాగుంటుంది. ఈ క్ర‌మంలోనే బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే అర‌టికాయ బజ్జీల‌ను ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. అర‌టికాయ బ‌జ్జీల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అర‌టికాయ బ‌జ్జీల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అర‌టికాయ – 1, శ‌న‌గ‌పిండి – 1 క‌ప్పు, బియ్యం పిండి – పావు క‌ప్పు, మిర‌ప‌కారం – 1 టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – అర టీస్పూన్‌, క‌సూరీ మేథీ – 1 టీస్పూన్‌, వంట సోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకి స‌రిప‌డా, వేయించిన ప‌ల్లీలు – 1 టేబుల్ స్పూన్‌, స‌న్న‌టి ఉల్లి త‌రుగు – అర క‌ప్పు, నిమ్మ‌ర‌సం – 1 టేబుల్ స్పూన్‌.

aratikaya bajji make like this very tasty

అర‌టికాయ బ‌జ్జీల‌ను త‌యారు చేసే విధానం..

అర‌టి కాయ‌ల తొక్కు తీసి స‌న్న‌గా చ‌క్రాల్లా త‌రిగి ఉప్పు నీళ్లలో వేసి ప‌క్క‌న ఉంచాలి. ఒక గిన్నెలో శ‌న‌గ‌పిండి, బియ్యం పిండి, మిర‌ప‌కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, క‌సూరీ మేథీ, వంట సోడా వేసి బాగా క‌ల‌పాలి. త‌గిన‌న్ని నీళ్లు జ‌త చేస్తూ బ‌జ్జీల పిండి మాదిరిగా క‌ల‌పాలి. స్ట‌వ్ మీద బాణ‌లిలో నూనె కాగాక అర‌టికాయ చ‌క్రాల‌ను ఒక్కోటి పిండిలో ముంచుతూ నూనెలో వేసి రెండు వైపులా దోర‌గా వేయించి పేప‌ర్ ట‌వ‌ల్ మీద‌కు తీసుకోవాలి. క‌త్తితో బ‌జ్జీల‌ను ఒక వైపు స‌న్న‌గా క‌ట్ చేయాలి. మూడు ప‌ల్లీలు, ఉల్లి త‌రుగు స్ట‌ఫ్ చేసి పైన నిమ్మ‌కాయ ర‌సం పిండి స‌ర్వ్ చేయాలి. వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు.

Admin

Recent Posts