business ideas

Pomegranate Farming : 8 ఎక‌రాల్లో దానిమ్మ పండ్ల పంట‌.. ఏడాదికి రూ.1.80 కోట్లు సంపాదిస్తున్న వ్య‌క్తి..

Pomegranate Farming : డ‌బ్బు సంపాదించాల‌న్న త‌ప‌న ఉండాలే కానీ వ్య‌వ‌సాయం చేసి కూడా కోట్లు సంపాదించ‌వ‌చ్చు. ఇత‌ర ఏ ప‌ని చేసినా చాలా మంది వ్య‌వ‌సాయం దండ‌గ అని భావిస్తారు. కానీ ఇప్పుడు చెప్ప‌బోయే అత‌ని గురించి చెబితే వ్య‌వ‌సాయంపై మీకు ఉన్న అభిప్రాయం త‌ప్ప‌ని అనుకుంటారు. ఎందుకంటే ఈయ‌న ఏడాదికి కోట్ల రూపాయ‌ల‌ను వ్య‌వ‌సాయం ద్వారానే సంపాదిస్తున్నాడు క‌నుక‌. అవును, ఈయనే క‌ర్ణాట‌క‌కు చెందిన ఏకాంత్ రాజ్‌. ఆ రాష్ట్రంలోని చిక్‌మ‌గ‌ళూర్ జిల్లా క‌డూర్ అనే ప్రాంతంలో ఈయ‌న 8 ఎక‌రాల్లో దానిమ్మ పంట‌ను సాగు చేస్తూ ఏటా కోట్ల రూపాయ‌ల‌ను సంపాదిస్తున్నారు.

ఏకాంత్ రాజ్ ఉన్న ప్రాంతంలో నీళ్లు స‌రిగ్గా ల‌భించ‌వు. వ‌ర్షాలు స‌రిగ్గా ప‌డ‌వు. అందువ‌ల్ల ఇత‌ర పంట‌ల క‌న్నా దానిమ్మ పంట ఉత్త‌మ‌మైంద‌ని తెలుసుకున్నాడు. దీనికి చీడ‌పీడ‌ల బెడ‌ద ఎక్కువ‌గా ఉండ‌దు. అలాగే నీళ్లు కూడా చాలా త‌క్కువ‌గా అవ‌స‌రం అవుతాయి. పైగా మార్కెట్‌లో దానిమ్మ పండ్ల‌కు ఎక్క‌డైనా స‌రే డిమాండ్ ఎక్కువ‌గానే ఉంటుంది. క‌నుక ఈయ‌న త‌న‌కు ఉన్న 3 ఎక‌రాల స్థ‌లంలో 1000 దానిమ్మ మొక్క‌ల‌ను పెట్టాడు. ఇంకేముంది.. ఆరంభంలోనే ఆయ‌న అద్భుతాల‌ను చూశాడు. పంట దిగుబ‌డి భారీగానే వ‌చ్చింది. దీంతో ఇంక ఆయ‌న వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

this man earns good money with pomegranate farming

ఏడాదికి రూ.2.20 కోట్ల ట‌ర్నోవ‌ర్‌..

అలా ఏకాంత్ రాజ్ అక్క‌డే మ‌రో 5 ఎక‌రాలు తీసుకుని మొత్తం 8 ఎక‌రాల్లో 2375 దానిమ్మ మొక్క‌ల‌ను పెంచుతున్నాడు. వీటి ద్వారా ఒక్కో చెట్టుకు సుమారుగా 50 కిలోల వ‌ర‌కు దానిమ్మ పండ్లు పండుతాయి. ఏడాదికి ఒక‌సారి పంట వ‌స్తుంది. అంటే మొత్తం ఈయ‌న సుమారుగా 118 ట‌న్నుల మేర దానిమ్మ పండ్ల‌ను పండిస్తున్నాడు. 1 కిలోకు రూ.180 నుంచి రూ.200 వ‌ర‌కు ఈయ‌న నేరుగా వ్యాపారుల‌కే విక్ర‌యిస్తున్నాడు. దీంతో ఈయ‌న‌కు మొత్తం రూ.2.20 కోట్ల ట‌ర్నోవ‌ర్ వ‌స్తోంది. అయితే అందులో ఖ‌ర్చులు పోగా రూ.1.8 కోట్లు మిగులుతున్నాయ‌ని చెప్పారు.

ఒక్కో మొక్క ధ‌ర రూ.48..

అయితే ఏకాంత్ రాజ్ త‌న దానిమ్మ చెట్ల‌కు కేవ‌లం సేంద్రీ ఎరువునే వాడుతారు. దీంతో పంట దిగుబ‌డి బాగా వ‌స్తుంద‌ని చెబుతారు. అలాగే అక్క‌డ నీటి ల‌భ్య‌త త‌క్కువ క‌నుక డ్రిప్ ఇరిగేష‌న్ వాడుతున్న‌ట్లు చెప్పారు. దీంతో చాలా వ‌ర‌కు నీళ్లు ఆదా అవ‌డ‌మే కాక‌, దానిమ్మ పండ్ల దిగుబ‌డి బాగా వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఇక మార్కెట్‌లో ఒక్కో దానిమ్మ మొక్క‌ను రూ.30 నుంచి రూ.50 మ‌ధ్య విక్ర‌యిస్తున్నార‌ని తెలిపారు. తాను రూ.48కి ఒక్కో మొక్క‌ను అమ్ముతున్నాన‌ని, తాను భాగ్వా అనే వెరైటీకి చెందిన దానిమ్మ పండ్ల‌ను పండిస్తున్నాన‌ని తెలిపారు. ఒక్కో దానిమ్మ మొక్క‌ను 3 మీట‌ర్ల దూరంలో నాటాల్సి ఉంటుంది. అయితే మొక్క‌ల‌ను నాటేందుకు ముందు నేల‌ను సార‌వంతం చేయాలి. అందుకు మ‌ట్టిలో సేంద్రీయ ఎరువుల‌ను క‌ల‌పాల్సి ఉంటుంద‌ని అన్నారు.

డ్రిప్ ఇరిగేష‌న్‌, సేంద్రీయ ఎరువులు..

ఈ విధంగా వ్య‌వ‌సాయం చేస్తే లాభసాటిగా ఉంటుంద‌ని ఏకాంత్ రాజ్ చెబుతున్నారు. వ్య‌వ‌సాయం అంటే పెద్ద‌గా తెలియ‌క‌పోయినా ఈ విధంగా సుల‌భంగా కొన్ని సూచ‌న‌లు తెలుసుకుంటే ఇలాంటి పండ్ల‌ను పెంచ‌వ‌చ్చ‌ని అంటున్నారు. అయితే దానిమ్మ పండ్ల‌ను పెంచేందుకు డ్రిప్ ఇరిగేష‌న్‌, సేంద్రీయ ఎరువులు చాలా ఉత్త‌మ‌మైన‌వ‌ని, దీంతో పంట దిగుబ‌డి బాగా రావ‌డ‌మే కాక‌, పండ్ల‌న్నీ ఒకే సైజులో ఉంటాయ‌ని తెలిపారు. క‌నుక ఎవ‌రికైనా ఆస‌క్తి ఉంటే ఈయ‌న రూట్లోనే దానిమ్మ పండ్ల‌ను పెంచండి. లాభాల‌ను ఆర్జించండి.

Admin

Recent Posts