Bandar Halwa : ఎంతో ప్రాచుర్యం పొందిన తీపి వంటకాలు మన దగ్గర చాలానే ఉన్నాయి. ఈ తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అలాంటి తీపి వంటకాల్లో బందరు హల్వా కూడా ఒకటి. బందరు హల్వా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ తీపి వంటకాన్ని రుచి చూసే ఉంటారు. ఈ బందరు హల్వాను అదే రుచితో మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ హల్వాను తయారు చేయడం కొద్దిగా శ్రమ అలాగే సమయంతో కూడుకున్న పనే అని చెప్పవచ్చు. అయినప్పటికి దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బందరు హల్వాను రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బందరు హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒక కప్పు, పంచదార -ఒకటింపావు కప్పు, నీళ్లు – అర కప్పు, జీడిపప్పు – కొద్దిగా, నెయ్యి – ముప్పావు కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్.
బందరు హల్వా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పిండిని తీసుకుని తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఈ పిండి ముద్దపై 3 కప్పుల నీళ్లు పోసి పిండిని నానబెట్టాలి. ఇలా రెండు నుండి మూడు గంటల పాటు నానబెట్టిన తరువాత పిండిని నలుపుతూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల గోధుమ పాలు వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని వడకట్టి దాని నుండి గోధుమ పాలను తీసుకోవాలి. మిగిలిన పిండిలో మరో కప్పు నీటిని పోసి మరలా కలుపుకోవాలి. ఈ గోధుమ పాలను కూడా వడకట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమపాలపై మూత పెట్టి ఒక గంట పాటు కదిలించకుండా ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాలు అడుగుకు తేలుతాయి. పైన ఉండే నీటిని పారబోసి పాలను తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో పంచదార, అర కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి.
ఇలా పంచదార కరుగుతుండగానే మరో కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో అర కప్పు పంచదార వేసి వేడి చేయాలి. ఈ పంచదారను క్యారమెల్ అయ్యే వరకు కలుపుతూ వేడి చేయాలి. ఇప్పుడు ముందుగా వేడి చేస్తున్న పంచదార కరిగిన తరువాత దీనిని జిగురుగా అయ్యే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. పంచదార కరిగి జిగురుగా అయిన తరువాత మంటను చిన్నగా చేసి ముందుగా సిద్దం చేసుకున్న గోధుమ పాలను పోసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై ఉండలు లేకుండా జెల్ లా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. గోధుమ పాలు జెల్ లాగా అయిన తరువాత క్యారమెల్ లాగా చేసుకున్న పంచదారను కింద స్టవ్ ఆఫ్ చేసి దీనిని వెంటనే హల్వాలో వేసి కలపాలి. ఇలా కలిపిన తరువాత నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసి కలపాలి.
నెయ్యినంతటిని హల్వా పీల్చుకోగానే మరో స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఇలా 20 నుండి 25 నిమిషాల పాటు నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. హల్వా చక్కగా ఉడికిన తరువాత కొద్ది సేపటికి పీల్చుకున్న నెయ్యిని వదులుతూ ఉంటుంది. ఇలా హల్వా నెయ్యిని వదిలే వరకు ఉడికించిన తరువాత యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు వేసి కలపాలి. దీనిని కళాయికి అంటుకోకుండా వేరుగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ హల్వాను కొద్ది కొద్దిగా ప్లేట్ లోకి తీసుకుని ఇలాగే తినవచ్చు లేదా నెయ్యి రాసిన గిన్నెలోకి తీసుకుని పైన సమానంగా చేసుకోవాలి. హల్వా పూర్తిగా చల్లారిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని కూడా తినవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బందరు హల్వా తయారువుతుంది. చేయడానికి సమయం పట్టినప్పటికి ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.