Bandla Ganesh : పవన్ కల్యాణ్ అంటే నిర్మాత బండ్ల గణేష్‌కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా చెప్పాలంటే.. పవన్ దేవుడు అనుకుంటే.. బండ్ల గణేష్ భక్తుడు.. అలా బండ్ల గణేష్ పాపులర్ అయ్యారు. వేదికలపై, ఇతర సందర్భాల్లో బండ్ల గణేష్ మాట్లాడే మాటలు వివాదాస్పదం అవుతుంటాయి. అందుకనే ఆయన ఇటీవలి కాలంలో ఎక్కడా మాట్లాడడం లేదు. అయితే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక నేపథ్యంలో బండ్ల గణేష్ ఓ అభిమానితో మాట్లాడిన సెల్‌ఫోన్ సంభాషణ వైరల్ అవుతోంది.
పవన్ కల్యాణ్ తాజాగా నటించిన భీమ్లా నాయక్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో ఆ ఈవెంట్ రద్దయింది. అయితే ఆ ఈవెంట్‌కు వెళ్లాలని ఓ అభిమాని బండ్ల గణేష్ ను కోరాడు. దీంతో బండ్ల గణేష్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మాటల తాలూకు ఆడియో ఒకటి బయటకు లీకైంది. అందులో బండ్ల గణేష్ త్రివిక్రమ్‌ను గాడు అంటూ సంబోధించారు. అలాగే త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ అభిమాని కాల్ చేసి భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు రావాలని కోరగా.. అందుకు బండ్ల గణేష్ స్పందిస్తూ.. తనకూ రావాలనే ఉందని, కానీ తనను ఈ వేడుకకు ఎవరూ పిలవలేదని అన్నారు. అలాగే తాను ఈ వేడుకకు వస్తే తాను ఎక్కడ పాపులర్ అవుతానోనన్న భయంతో దర్శకుడు త్రివిక్రమ్ గాడు తనను వేడుకకు రాకుండా ఆపుతున్నాడని.. బండ్ల గణేష్ అన్నారు.
అయితే తాను వేడుకకు వస్తానని.. కానీ ఎక్కడో జనం మధ్యలో ఉంటానని.. అప్పుడు ఫ్యాన్స్ అందరూ బండ్లన్న అని అరవాలని.. దీంతో తాను జనం మధ్య నుంచి సడెన్‌గా స్టేజిపై ప్రత్యక్షం అవుతానని.. బండ్ల గణేష్ చెప్పారు. ఈ క్రమంలోనే ఈ మాటల తాలూకు ఆడియో క్లిప్ ఒకటి వైరల్‌గా మారింది. అయితే నిజంగానే బండ్ల గణేష్ ఇలా మాట్లాడారా ? అసలు ఆయనకు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఏమైనా వైరం ఉందా ? అని చర్చించుకుంటున్నారు. ఇక ఇందులో నిజా నిజాలు తేలాల్సి ఉంది.