Bellam Semiya Payasam : మనం అప్పుడప్పుడూ సేమియాతో పాయాసాన్ని తయారు చేస్తూ ఉంటాం. సేమియాతో చేసే పాయసం చాలా రుచిగా ఉంటుంది.ఈ పాయసాన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. అయితే ఈ సేమియా పాయసాన్ని తయారు చేయడానికి మనం ఎక్కువగా పంచదారను ఉపయోగిస్తూ ఉంటాం. కేవలం పంచదారతోనే కాకుండా బెల్లంతో కూడా మనం ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. బెల్లం తో చేసే సేమియా పాయసం కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల శరీరానికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. పాలు విరగకుండా బెల్లంతో రుచిగా సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం సేమియా పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
సేమ్యా – ఒక కప్పు, పాలు – ఆరు కప్పులు, నెయ్యి – ఒక టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, కచ్చా పచ్చగా దంచిన యాలకులు – 4, బెల్లం తురుము – ఒకటింపావు కప్పు.
బెల్లం సేమియా పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రైఫ్రూట్స్ ను వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. అదే నెయ్యిలో సేమియాను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలు మరిగిన తరువాత వేయించిన సేమియాను వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇందులోనే యాలకులను వేసి మధ్యస్థ మంటపై సేమియా మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో బెల్లం తురుము వేసి కలపకుండా మూత పెట్టి 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 5 నిమిషాల తరువాత బెల్లం కరిగేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి.
తరువాత డ్రై ఫ్రూట్స్ ను వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా పాయసం తయారవుతుంది. ఇందులో పూర్తిగా బెల్లాన్నే కాకుండా కొద్దిగా పంచదారను కూడా వేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు చాలా తక్కువ సమయంలో అయ్యే ఈ సేమియా పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. పంచదారకు బదులుగా ఇలా బెల్లంతో చేసిన పాయాసాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది.